Hyderabad: హాస్టల్ వాష్‌రూమ్‌లో ఒకరు.. బిల్డింగ్ పైనుంచి దూకి మరొకరు
రంగారెడ్డి జిల్లాలో 23 ఏళ్ల యువతి తన హాస్టల్ వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 7 March 2024 9:06 AM ISTHyderabad: హాస్టల్ వాష్‌రూమ్‌లో ఒకరు.. బిల్డింగ్ పైనుంచి దూకి మరొకరు
రంగారెడ్డి: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 23 ఏళ్ల యువతి తన హాస్టల్ వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతురాలు కరీంనగర్ జిల్లా ముడపల్లికి చెందిన ముద్దం విద్యాశ్రీగా గుర్తించారు. హాస్టల్ వాష్‌రూమ్‌లోని షవర్‌లో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
విషయం తెలుసుకున్న రూమ్‌మేట్స్ బాలికను కొండాపూర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె వివాహం మార్చి 17న నిర్వహించాలని నిర్ణయించారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గంట ముందు కాబోయే భర్త ఆమెతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు కేసు నమోదు చేయాల్సి ఉంది. ఈ విషాద ఘటనకు దారితీసిన ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. తదుపరి విచారణ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పరీక్షలలో పాస్ కావాలని తండ్రి కూతురిని మందలించడంతో.. కూతురు మనస్తాపానికి గురై బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రగతి నగర్ సాయి కీర్తి కాలనీ లోని "ధర్మపురి దొరబాబు అపార్ట్మెంట్" వాచ్మెన్ కూతురు(17) ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నది. విద్యార్థిని మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో బిల్డింగ్ ఏడవ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. మొదటి సంవత్సరం ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిందని ఈసారి అన్ని సబ్జెక్టు బాగా చదివి.. అన్ని సబ్జెక్టులు పాస్ కావాలని తండ్రి మందలించడంతో అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.