ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ..హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్‌లోని చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ..హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్‌లోని చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీనివాసనగర్‌కు చెందిన రామదేవి, కోటేశ్వరరావు దంపతుల కుమార్తె జమీనా (19) ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆమె జగదీష్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే, వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన తల్లిదండ్రులు ఆ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా, అతడిని కలవకుండా జమీనాను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.
పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు ఎంత పిలిచినా జమీనా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి, పొరుగువారి సహాయంతో తలుపులు పగలగొట్టారు. లోపల కుమార్తె విగతజీవిగా పడి ఉండటం చూసి వారు కుప్పకూలిపోయారు. తన కుమార్తె మరణానికి జగదీషే కారణమని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిల్కలగూడ ఎస్‌హెచ్‌ఓ వి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 194 కింద అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నివేదిక కోసం తరలించామని, తదుపరి విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.