ఆదివారం ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో 18 ఏళ్ల బాలుడు ఒక రోగిని కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియాజుద్దీన్ అనే వ్యక్తి చికిత్స నిమిత్తం జూన్ 23న ఆస్పత్రిలో చేరాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో 18 ఏళ్ల యువకుడు ఆస్పత్రిలోకి ప్రవేశించి రియాజుద్దీన్‌పై కాల్పులు జరిపాడు. నిందితుడు మూడు నుంచి నాలుగు రౌండ్ల బుల్లెట్లు కాల్చాడని పోలీసులు తెలిపారు.
రియాజుద్దీన్ డ్రగ్స్ బానిస అని, అతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడి కోసం అన్వేషణ కొనసాగుతోందని, ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, నిందితులను విడిచిపెట్టబోమని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఉద్ఘాటించారు. రాజధాని ప్రాంతంలోని అన్ని ఆసుపత్రుల భద్రతను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.