తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రెండు వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులు ఉన్నారు. రాయచూర్ నుంచి బస్సు హైదరాబాద్‌కు వెలుతుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణం అని పోలీసులు బావిస్తున్నారు.
మరో ఘటనలో వేగంగా వెలుతున్న కారు టైరు పేలిపోవడంతో అదుపు తప్పి ముందు వెలుతున్న లారీని ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి హెరిటేజ్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.