కల్తీ మద్యం తాగి 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
అమృత్‌సర్‌లోని మజితా ప్రాంతంలో విషపూరిత మద్యం సేవించి 14 మంది మరణించారు.
By Medi Samrat
అమృత్‌సర్‌లోని మజితా ప్రాంతంలో విషపూరిత మద్యం సేవించి 14 మంది మరణించారు. అదే సమయంలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు. మృతుల్లో భంగలి కలాన్, మార్డి కలాన్, జయంతిపూర్ గ్రామాల ప్రజలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ బృందాలు విషపూరిత మద్యం విక్రయిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
మద్యం సేవించి కుటుంబసభ్యులు వాంతులు చేసుకున్నారని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా కల్తీ మద్యం వ్యాపారం సాగుతున్నప్పటికీ పాలకవర్గం కఠిన చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. మంగళవారం ఉదయం అధికారులు భంగలితో సహా ప్రభావిత గ్రామాలను సందర్శించారు.
బాధిత కుటుంబాల పరిస్థితిని డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విషపూరిత మద్యం కారణంగా ప్రజలు మరణించిన తరువాత పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నకిలీ మద్యం రాకెట్ సూత్రధారి ప్రభ్‌జీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 105 BNS, 61A ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అమృత్‌సర్‌లోని గ్రామీణ ప్రాంత SSP మణిందర్ సింగ్ తెలిపారు. మొత్తం నెట్‌వర్క్‌పై విచారణ కొనసాగుతోంది.
ఇక్కడ కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని నిన్న రాత్రి మాకు సమాచారం అందింది. వెంటనే చర్యలు తీసుకుని నలుగురిని అరెస్టు చేశాం. విచారణలో మేము ప్రధాన సరఫరాదారు పర్బ్జిత్ సింగ్‌ను అరెస్టు చేసాము. మద్యం ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నామన్నారు. మేము మొత్తం వ్యవస్థను కూల్చివేస్తాము. కల్తీ మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. మేము 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసాము. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, ఆరుగురు ఆస్పత్రి పాలయ్యారని SSP మణిందర్ సింగ్ తెలిపారు.