గుజరాత్‌లోని వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో విహారయాత్రకు వెళ్లిన 12 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులతో సహా మొత్తం 14 మంది మృతి చెందారు. పడవలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం. ఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. "విహారయాత్రకు ఇక్కడికి వచ్చిన పాఠశాల విద్యార్థులతో ప్రయాణిస్తున్న పడవ హర్ని సరస్సులో బోల్తా పడింది. అగ్నిమాపక దళం ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థులను రక్షించింది, తప్పిపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది" అని వడోదర చీఫ్ ఫైర్ ఆఫీసర్ పార్థ్ బ్రహ్మభట్ తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసుకున్నారని, వడోదరకు బయలుదేరి వెళతారని ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. "ప్రస్తుతం అత్యవసర సహాయ-రక్షణ, చికిత్స కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మరింత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడబడాలని మేమంతా భావిస్తున్నాము. ప్రార్థిస్తున్నాము" అని ఆయన చెప్పారు.