రణరంగంగా మారిన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. 12 మంది మృతి
12 dead in violence as Bengal votes for panchayat polls. భారీ హింసాకాండ మధ్య పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
By Medi Samrat Published on 8 July 2023 2:56 PM ISTభారీ హింసాకాండ మధ్య పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింస ఘటనలు చోటుచేసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పటి నుండి, మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో తొమ్మిది మంది మరణించారు. అర్ధరాత్రి నుండి ఎన్నికల సంబంధిత హింసాత్మక ఘటనల్లో మరో ముగ్గురు మరణించారు. దీంతో పంచాయతీ ఎన్నికల కారణంగానే 12 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు తృణమూల్, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వీరితో పాటు స్వతంత్ర పార్టీ మద్దతుదారులు కూడా హింసలో మరణించారు.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలను మోహరించినప్పటికీ భీకర హింసాకాండ జరుగుతోంది. పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ముర్షిదాబాద్‌లోని బెల్దంగాలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య జరిగిన ఘర్షణలో అధికార పార్టీకి చెందిన బాబర్ అలీ అనే కార్యకర్త చనిపోయాడు. హింసాకాండ అనంతరం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాల్పులలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్త ఆసుపత్రి పాలయ్యాడు. కూచ్ బెహార్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బ్యాలెట్ పేపర్లను దోచుకున్నారు.
డైమండ్ హార్బర్ మాల్దాలోని మానిక్‌చక్, గోపాల్‌పూర్ గ్రామ పంచాయతీకి చెందిన జిషార్డ్ తోలాలో భారీ బాంబు పేలుడు జరిగింది. ఇందులో ఓ వ్యక్తి మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి పేరు షేక్ మాలెక్ అని తెలిపారు. హుగ్లీలో స్వతంత్ర అభ్యర్థిపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపినట్లు సమాచారం.