ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 10 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తూ ఉన్నారు. ఆ సమయంలో రోగులు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాటకి దారితీసింది.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 37 మంది చిన్నారులను ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చారు. మంటలు చెలరేగిన పిల్లల వార్డులో 54 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు. గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఝాన్సీ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలోని ఎన్‌ఐసియులో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరం, హృదయ విదారకంగా ఉందని తెలిపారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులను ఆదేశించామని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఎక్స్ లో తెలియజేశారు.