ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు డీఆర్‌జీ జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో వాహనం పేల్చివేయడంతో పది మంది పోలీసులు, వారి డ్రైవర్ మరణించినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నుండి పోలీసులు తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ దాడి ఘటనపై ఛత్తీస్‌గత్ ఐజీ సుంద్రరాజ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.