మేడ్చల్‌లో మరో దారుణం.. ల్యాబ్‌కి రమ్మని విద్యార్థినిపై అత్యాచారం
By Newsmeter.Network Published on 25 Dec 2019 10:37 AM ISTమేడ్చల్: జిల్లాలోని పేట్ బషీరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ బీటెక్ విద్యార్థిని (19)పై కాలేజీ ల్యాబ్ ఇన్‌చార్జ్ అత్యచారానికి పాల్పడ్డాడు. ల్యాబ్ ఇన్‌చార్జి వెంకటయ్యను ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత విద్యార్థిని పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ల్యాబ్‌కి పిలిచి తలుపులు వేసి అత్యాచారం చేశాడని విద్యార్ధిని ఫిర్యాదులో పేర్కొంది. బాధిత విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. బాధిత విద్యార్థిని మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో చదువుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
దిశ హత్య ఘటన నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత కూడా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోజు రోజుకు అత్యచారాలు పెరిగిపోతునే ఉన్నాయి. దిశ హత్య తర్వాత హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మహిళలకు పోలీసులు అందుబాటులో ఉంటున్నారు.