క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష.. నేను కూడా ఎదుర్కొన్నా : గేల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2020 2:55 PM IST
క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష.. నేను కూడా ఎదుర్కొన్నా : గేల్

క్రికెట్‌ ఆటలోనూ జాతి వివక్ష ఉందని, తన కెరీర్‌లో చాలాసార్లు జాతివివక్షను ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్‌ తెలిపాడు. తన శరీర రంగు కారణంగానే ఎన్నో సార్లు వివక్షను ఎదుర్కొన్నానని అన్నాడు. అయితే.. ఎప్పుడు ఎక్కడ గేల్‌ జాతి వివక్షను ఎదుర్కొన్నాడో చెప్పలేదు. అమెరికాలో డెరెక్‌ చావువిన్‌ అఫ్రో అనే పోలీస్‌ అధికారి జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపై కాలుపెట్టి అతడి మృతికి కారణమయ్యాడు. దీంతో అమెరికాలో తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుండడంతో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. దీనిపై విండీస్ వీరుడు గేల్ స్పందించాడు.

'నేను చాలా దేశాలు తిరిగా. కొన్ని దేశాల్లో పర్యటించేటప్పుడు వర్ణవివక్షను ఎదుర్కొన్నా. ఎందుకంటే నేను నలుపు. జాతి వివక్ష అనేది పుట్‌బాల్‌లోనే కాదు క్రికెట్‌లోనూ ఉంది. కొన్ని సార్లు సొంత జట్టులోనే నాకు చివరి ప్రాధాన్యం ఉంటుంది. నల్లజాతీయులు కూడా అందరిలాంటి వారే. నలుపంటే శక్తిమంతం నల్లజాతి వారిగా మేం గర్విస్తాం. జాత్యాహంకారులారా నల్లవారిని తక్కువ స్థాయివారిగా భావించడం ఆపేయండి. నల్లజాతి వారు ఆత్మవిశ్వాసంతో ఉండడండి. మిమ్మల్ని మీరు తక్కవ చేసుకోవడం ఆపేయండి' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

కొద్ది రోజుల్లో క్రితం ఇంగ్లాండ్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సమయంలో ఇంగ్లాండ్‌ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ పై ఓ ప్రేక్షకుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని ఆర్చర్‌ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీంతో కివీస్‌ క్రికెట్‌ బోర్డుతో ఆర్చర్‌కు క్షమాపణలు చెప్పింది. తమ దేశంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు అభిమానిని గుర్తించారు. అతడు మళ్లీ మైదానంలో క్రికెట్‌ చూడకుండా కివీస్‌ బోర్డు నిషేదం విధించిన సంగతి తెలిసిందే.

Next Story