Fact Check : హైదరాబాద్ రోడ్ల మీద కరోనా పాజిటివ్ రోగి అధికారులను ముప్పతిప్పలు పెట్టారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 July 2020 7:14 AM GMT
Fact Check : హైదరాబాద్ రోడ్ల మీద కరోనా పాజిటివ్ రోగి అధికారులను ముప్పతిప్పలు పెట్టారా..?

కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే..! అదుపు చేయడానికి అధికారులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొందరు నిబంధనలు పాటించకుండా ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను క్వారెంటైన్ లో ఉంచినప్పటికీ పారిపోతూ ఉండడం అధికారులకు తలపోటుగా మారిపోతోంది.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. క్వారెంటైన్ సెంటర్ నుండి ఓ వ్యక్తి పారిపోవడంతో అధికారులు అతన్ని చుట్టముట్టడం.. బలవంతంగా తీసుకుని వెళ్లడం గమనించవచ్చు. హైదరాబాద్ లోని క్వారెంటైన్ సెంటర్ నుండి ఆ వ్యక్తి పారిపోయాడని పలువురు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

టుమ్రీలు అనే ఫేస్ బుక్ పేజీలో “హైదరాబాద్‌లో ఓ కరోనా పాజిటివ్ పారిపోయాడు" అంటూ పోస్టు పెట్టారు.

నిజ నిర్ధారణ:

ఈ వీడియోలో చెబుతున్నట్లుగా హైదరాబాద్ లో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న రోగి పారిపోవడం అన్నది పచ్చి అబద్ధం.

ఈ ఘటన బాగా రద్దీగా ఉన్న రోడ్డులో చోటుచేసుకుంది. చుట్టూ చాలా షాపులు ఉండడం గమనించవచ్చు. వీడియోను బాగా పరిశీలించి చూస్తే షాపుల హోర్డింగ్ లు చూడొచ్చు. అందులో కొన్ని మలయాళంలో రాయడం ఉండడం గమనించవచ్చు.

C1

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడమే కాకుండా, ‘Man escapes quarantine in Kerala’ అన్న కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా జులై 6, 2020కి సంబంధించిన పలు న్యూస్ రిజల్ట్స్ కనిపించాయి. పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

Onmanorama, The New Indian Express మీడియా సంస్థల కథనం ప్రకారం ఈ ఘటన కేరళ రాష్ట్రం లోని పతనంతిట్ట టౌన్ లో చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాల నుండి వచ్చిన ఓ వ్యక్తి సెల్ఫ్ క్వారెంటైన్ లో నుండి బయటకు పారిపోయి వచ్చాడు.. దీంతో హెల్త్ కేర్ సిబ్బంది, పోలీసులు అతన్ని వెంబడించి పతనంతిట్ట లోని సెయింట్ పీటర్స్ జంక్షన్ లో అదుపులోకి తీసుకున్నారు.

అతడిని మాస్క్ వేసుకోలేదని పోలీసులు ప్రశ్నించారు. ఇక పోలీసుల ఎంక్వయిరీలో అతడు మూడు రోజుల కిందటే దుబాయ్ నుండి వచ్చాడని.. అతన్ని ఇంట్లో అబ్జర్వేషన్ లో ఉండమన్నారు. మద్యం తాగేసిన అతడు ఊర్లో తిరగడం మొదలుపెట్టారు. దీంతో అతన్ని పట్టుకోడానికి అధికారులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. హెల్త్ వర్కర్స్ అతడి చేతులను కాళ్ళను కట్టేసి, అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అతడు భార్యతో గొడవపడి బయటకు వచ్చేశాడని మరికొందరు తెలిపారు.

హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ వ్యక్తి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాడన్నది 'అబద్ధం'. దుబాయ్ నుండి వచ్చిన సదరు వ్యక్తి హోమ్ క్వారెంటైన్ లో ఉండకుండా బయటకు వచ్చేశాడు. కేరళ లోని పతనంతిట్టలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Next Story