నాకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరం.. ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్యలు
By సుభాష్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఆయన అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. తనకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు కరోనా అనేది ఇంచుమించు ప్లూ లాంటిదేనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా రావడం అన్నది దేవుడి ఆశీర్వాదం అంటూ అభివర్ణించడం మరింత వివాదంగా మారింది. కరోనా అంటుకున్నదని తెలిసిన వెంటనే మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కోలుకున్న తర్వాత ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఇదంతా చెప్పుకొచ్చారు. కోవిడ్ సోకడం వల్లనే కదా నాకు కరోనాను నయం చేయగల శక్తివంతమైన డ్రగ్స్ గురించి తెలిసింది.. అని వ్యాఖ్యానించారు. రెజెనెరాన్ పార్మాస్కూటికల్ డ్రగ్స్ వాడటం వల్లనే కదా అది కరోనాను ఎంత గొప్ప నయం చేస్తుందో అనుభవంలోకి వచ్చింది అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులను సైతం ట్రంప్ మెచ్చుకున్నారు. అమెరికా వాసులందరికీ ఇలాగే ఉచిత చికిత్స అందేలా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కరోనాను ప్రపంచం మీదకు వదిలిన చైనా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
కాగా, ఇటీవల ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌కు కరోనా నిర్ధారణ అయింది. ట్రంప్ సహాయకురాలు హోప్‌హిక్స్‌కు కరోనా సోకడంతో ట్రంప్‌కు ఈ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ తేలింది. అయితే హోప్‌హిక్స్‌తో కలిసి ఇటీవల ఓ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. దీంతో ఆయనకు కరోనా సోకింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణం, మరోవైపు అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో ట్రంప్‌కు కరోనా సోకడం చర్చనీయాంశంగా మారింది. చిన్న విరామం కూడా తీసుకోకుండా శ్రమిస్తున్న ట్రంప్ సహాయకురాలు హోప్ హిక్స్ కరోనా బారిన పడటంతో ట్రంప్ దంపతులకు పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ముందే ఎన్నికల వేడి ఉండటం, ట్రంప్‌కు కరోనా సోకడంతో పార్టీ వర్గాల్లో అలజడి నెలకొంది.
అయితే రెండు రోజుల కిందట కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వాల్టర్ రీడ్ మెడికల్ ఆస్పత్రి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైట్ హౌస్‌కు చేరుకున్న ట్రంప్.. ఎగ్జిక్యూటివ్ మాన్షన్‌లో అభివాదం చేస్తూ తాను బాగానే ఉన్నాను అంటూ సైగలు చేస్తూ సంకేతాలిచ్చారు. అనంతరం మాస్క్ తొలగించి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే డిశ్చార్జ్ కావడానికి ముందు అకస్మాత్తుగా ఆస్పత్రి నుంచి బయటకువచ్చిన ట్రంప్.. కారులో తిరిగారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌కు చికిత్స అందించిన ఆస్పత్రి వైద్యులుతో పాటు ప్రతిపక్ష డెమోక్రాట్లు ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. అయితే తన కోసం ప్రార్థించే అభిమానుల్లో ఉత్తేజం నింపేందుకే తాను ఇలా బయటకు వచ్చినట్లు ట్రంప్ పేర్కొనడం గమనార్హం. తాజాగా కరోనా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.