ఆరు నెలల్లో ఆక్స్ ఫర్డ్ టీకా..!
By న్యూస్‌మీటర్ తెలుగు
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలై తొమ్మిది నెలలు దాటినప్పటికి ఇంకా ఆగడం లేదు. ఈ మహమ్మారికి మందును కనిపెట్టేందుకు చాలా దేశాలు శ్రమిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కూడా అవి పూర్తి స్థాయిలో కరోనాను ఎదుర్కొనడం లేదు. కాగా.. ఇప్పుడు అందరి దృష్టి ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న టీకాపైనే ఉంది.
ఈ టీకా మరో ఆరు నెలలు అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ ఆశాభావంతో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఆరోగ్య నియంత్రణ అధికారుల నుంచి ఆమోదాలు లభిస్తాయని, అ వెంటనే టీకాను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతోంది. 'ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తాం. అంతకంటే తక్కువ సమయమూ పట్టొచ్చు.' అని ఓ ప్రభుత్వాధికారి చెప్పినట్లు ది టైమ్స్ పత్రిక ఓ కథనం వెల్లడించింది.
ఆమోదం పొందిన తరువాత టీకాను 65 అంతకంటే.. ఎక్కువ వయస్సున్న వారికి ముందుగా అందిస్తామని అంటున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటోంది.
భారత్‌లోనూ ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రయోగాలు జరుగుతుండగా అవి ఫైనల్ దశకు చేరుకుంటే.. భారీ సంఖ్యలో కోవిడ్ టీకాలు ఉత్పత్తి చేసి, సగం భారత్‌లో వినియోగించడం.. మిగతావి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. కాగా, బిల్‌గేట్స్ లాంటి ప్రముఖులు సైతం ఆక్స్‌ఫర్డ్-సీరమ్ కోవిడ్ వ్యాక్సిన్‌కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.