తెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి

By సుభాష్  Published on  30 July 2020 12:51 PM GMT
తెలంగాణలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటి వరకు పది లక్షలకుపైగా ప్రజలు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్‌ కార్మికుల అంకిత భావంతో రికవరీలో ఈ మైలు రాయి సాధించినట్లు చెప్పారు.

కరోనా వైరస్‌ నుంచి 1,020,000 మంది రోగులు కోలుకున్నారని, ఇది గొప్ప విషయమన్నారు. రికవరీ రేటు ఏప్రిల్‌లో 7.85 శాతం ఉందని, ప్రస్తుతం 64.4 శాతంగా ఉందని చెప్పారు.

దేశంలోని 16 రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉందని, ఢిల్లీలో 88 శాతం, లడక్‌లో 80 శాతం, హర్యానాలో 78 శాతం, అస్సాంలో 76శాతం, తెలంగాణలో 74 శాతం, గుజరాత్‌, తమిళనాడులలో 73శాతం, రాజస్థాన్‌లో 70శాతం, మధ్యప్రదేశ్‌ లో 69శాతం, గోవాలో 68 శాతం ఉందని వివరించారు. జూన్‌లో 3.33శాతం, ప్రస్తుతం 2.21 శాతం ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యల్పమని అన్నారు.

ఇక ఆర్టీ-పీసీఆర్‌, యాంటిజెన్‌ పరీక్షలతో సహా దేశంలో18,190,000 పరీక్షలు జరిగాయని అన్నారు. రోజుకు సగటు పరీక్షల్లో వారానికి వారం పెరుగుదల ఉందన్నారు. దేశంలో రోజుకు పది లక్షల జనాభాకు 324 పరీక్షలు నిర్వహిస్తుందన అన్నారు. కాగా, కరోనా కోసం దేశంలో రెండు వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని వివరించారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు కంటే తెలంగాణలో ఎక్కువగా ఉందన్నారు.

Next Story
Share it