తెలంగాణ: ఆ గ్రీన్‌ జోన్‌ జిల్లాలో నలుగురికి కరోనా

By సుభాష్  Published on  10 May 2020 10:20 AM GMT
తెలంగాణ: ఆ గ్రీన్‌ జోన్‌ జిల్లాలో నలుగురికి కరోనా

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చినా.. గత వారం రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ కఠినంగా అమలు కావడంతో మంచి ఫలితాలిస్తున్నాయి. దీంతో రెండు దశల్లో పూర్తిగా ప్రజలెవ్వరు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితి కాగా, మూడో దశలో కూడా లాక్‌డౌన్‌ కఠినంగానే అమలవుతోంది.

ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రీన్‌ జోన్‌లో ఉన్న ఈ జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ప్రకటించారు. ఆత్మకూరు మండలంలో మూడు పాజిటివ్‌ కేసులు, సంస్థాన్‌ నారాయణపురంలో ఒక కేసు నమోదైనట్లు తెలిపారు.

వీరంతా కూడా ఈ మధ్యకాలంలో ముంబై నుంచి స్వస్థలాలకు వచ్చినట్లు గుర్తించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తిస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

కాగా, గత 14 రోజులకు పైగా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతిరోజు తక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నాలుగు కరోనా కేసులు నమోదు కావడంపై మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.

Next Story