కరోనాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
By సుభాష్ Published on 30 March 2020 5:59 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను పట్టిపీడిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక మనదేశంలో గడిచిన 24 గంటల్లో 92 కొత్త కేసులు నమోదు కాగా, నలుగురు కరోనా బాధితులు మృతి చెందినట్లు కేంద్ర సర్కార్ వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత్ మూడో దశకు చేరుకోలేదని, మనం ఇంకా లోకల్ ట్రాన్స్ మిషన్ (కరోనా బాధితుడిని తాకడం వల్ల వ్యాపించడం) దశలోనే ఉన్నామని పేర్కొంది. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (సమూహ వ్యాప్తి)పై వస్తున్న ప్రచారం కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే తామే వెల్లడిస్తామని తెలిపింది. ప్రస్తుతానికి కరోనా విషయంలో కమ్యూనిటీ అనే పదాన్ని వాడకూడదని మీడియాకు సూచించింది.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 1071 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 100 మంది కోలుకున్నారని, 29 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇక అత్యధికంగా 215 పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదైనట్లు తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
ఈ సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మన దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై, సామాజిక దూరం పాటిస్తే కరోనాను ఎదుర్కొగలం. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తే అప్పుడు మనం సక్సెస్ అయినట్లు. సూచనలు, సలహాలు పాటించకుంటే సమస్యల్లో చిక్కుకుంటాం. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి.. అని అన్నారు.