కొవాగ్జిన్ వ్యాక్సిన్ తో ఇన్ఫెక్షన్ కు నో ఛాన్స్.. ఎందుకంటే?
By సుభాష్ Published on 10 July 2020 5:27 AM GMTమహమ్మారికి చెక్ చెప్పేందుకు వీలుగా తయారు చేసే వ్యాక్సిన్లకు సంబంధించి బోలెడన్ని పద్దతులు ఉన్నాయి. అలాంటి వాటిల్లో భద్రమైనది ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ గా చెబుతారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ చెప్పేందుకు పలు దేశాలకు చెందిన ఫార్మాకంపెనీలు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ రూపొందించి.. కీలకమైన క్లీనికన్ టెస్టుల్ని నిర్వహిస్తున్నారు. భారత్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ పై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి.
ఈ మధ్యన ఈ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ఆగస్టు పదిహేనున లాంఛ్ చేస్తారన్న ప్రచారం జరగటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. అయితే.. ఈ వ్యాక్సిన్ ఎప్పటికి విడుదలవుతుందన్న విషయాన్ని వదిలేస్తే.. మిగిలిన వ్యాక్సిన్ల మాదిరి కాకుండా ఇనాక్టివేటెడ్ విధానంలో రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా ఈ వ్యాక్సిన్ కు సైడ్ ఎఫెక్టులు ఉండవని చెబుతున్నారు.
ఈ విధానంలోనిర్వీర్యం చేసిన వైరస్ ను వ్యాక్సిన్ రూపంలో శరీరంలోకి ప్రవేశ పెడతారు. దీని తరహాలోనే పోలియోకు వ్యాక్సిన్ తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వైరస్ లు పూర్తిగా నిర్వీర్యమై ఉండటంతో.. కొత్తగా వైరస్ లు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. సదరు వైరస్ తమ సంఖ్యను పెంచుకునే అవకాశం ఉండదు. వ్యాక్సిన్ తో రోగనిరోధక శక్తి ఉత్తేజితమవుతుంది. శరీరంలోకి యాంటీ బాడీలు ఉత్పత్తి కావటంతో.. మాయదారి వైరస్ ఏమీ చేయలేదు. ఈ కారణంతో కీలకమైన క్లీనికల్ ట్రయల్స్ లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తో రోగ నిరోధక వ్యవస్థ ఏ మేరకు పెరుగుతోందని.. కొవిడ్ వైరస్ ను ఎంతలా నిలువరించే శక్తి ఉంటుందన్న సైంటిస్టులు గుర్తిస్తే సరిపోతుందన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. ఈ వ్యాక్సిన్ ను త్వరగా రూపొందించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.