ఆ షాపులోని మైసూర్‌ పాక్‌ తింటే కరోనా రాదట..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2020 1:32 PM GMT
ఆ షాపులోని మైసూర్‌ పాక్‌ తింటే కరోనా రాదట..!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారికి ఇంకా మందు కనుగొనలేదు. శాస్త్రవేత్తలంతా మందను కనుగొనే ప్రయత్నంలో నిమగ్నమైవున్నారు. అయితే.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన స్వీట్‌ షాపులోని 'హెర్భల్‌ మైసూర్‌పాక్‌' ను తింటే నయం అవుతుందని ప్రకటించాడు. అంతేకాదండోయ్‌.. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకు ఫ్రీగా ఇస్తానన్నాడు. ఇంకేముంది ఇది నమ్మిన జనం అతడి దుకాణం ముందు క్యూ కట్టారు. కరోనా సమయంలో వ్యాపారులంతా ఇబ్బందులు పడుతుంటే.. అతడి వ్యాపారం మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలు సాగుతోంది. అయితే.. ఈ 'హెర్బల్‌ మైసూర్‌ పాక్‌' ఫార్ములాను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు కోయంబత్తూరు జిల్లా తొట్టిపాళెయంలో ఉన్న తిరునెల్వేలి లాలా స్వీట్‌ దుకాణ యజమాని.

తన తాత సిద్ద వైద్యం నేర్పించాడని, ఆ నిబందనల ప్రకారం ఔషద మైసూర్‌ పాక్‌ తయారు చేస్తున్నట్లు, ఇది తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా తగ్గుతుందని తెలిపాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఆహార, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పని చెప్పి దుకాణానికి సీల్ వేశారు. దుకాణం నుంచి 120 కిలోల మైసూరు పాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ... ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ప్రచారంతో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాము ఆహార భద్రతా శాఖ వారిని కోరినట్లు రమేశ్ తెలిపారు.

Next Story