ఇక హైదరాబాద్‌లో 'కరోనా' పరీక్షలు..రెండు సార్లు తప్పనిసరి

By సుభాష్  Published on  31 Jan 2020 7:07 AM GMT
ఇక హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు..రెండు సార్లు తప్పనిసరి

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ దేశాలకు, రాష్ట్రాలకు పాకుతోంది. దీంతో కరోనా వైద్య నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు కరోనా పరీక్షలు పుణేలో నిర్వహిస్తున్నారు. దీంతో రిపోర్టు రావాలంటే 24 గంటలు పడుతుంది. ఇప్పుడు ఈ ఇబ్బందులు లేకుండా గాంధీ ఆస్పత్రిలోనే పరీక్షలు నిర్వహించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దేశంలో పది కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో గాంధీ ఆస్పత్రి కూడా ఉండటం గమనార్హం.

రెండు సార్లు పరీక్షలు తప్పనిసరి..

కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఇక నుంచి రెండు సార్లు వ్యాధి నిర్ధారణ పక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సారి పరీక్ష చేశాక అందులో నెగిటివ్‌ వచ్చినా.. 48 గంటల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. దీని వల్ల పూర్తిస్థాయిలో నమ్మకం ఏర్పడుతుందని పేర్కొంది.

కాగా, ఇప్పటి వరకు పది మంది కరోనా అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఐదుగురికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయింది. మరో ఐదుగురి రక్త నమూనాలను పుణేకు పంపించింది. వీరి రిపోర్టులు రావాలంటే 24గంటల సమయం పడుతుంది. అయితే మొదటి ఐదుగురికి నెగిటివ్‌ వచ్చినా.. మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ ఐదుగురిలో ముగ్గురు వ్యక్తులు చైనాలోని వుహాన్‌ నుంచి హాంకాంగ్‌ మీదుగా భారత్‌కు వచ్చినట్లు ఫీవర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Next Story