భారత్‌లో పరిస్థితి చేయిదాటిపోతోందా ?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 7:32 AM GMT
భారత్‌లో పరిస్థితి చేయిదాటిపోతోందా ?

  • రెండు వారాల్లో లక్షకు పైగా కేసులు
  • ఒక్క మహారాష్ట్రలోనే లక్ష 11 వేల కేసులు
  • అండమాన్ నికోబార్ దీవుల్లో అతి తక్కువ కేసులు

భారత్ లో పరిస్థితి చేయిదాటిపోతోందా ? అంటే దాదాపు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. 4 విడతలుగా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ పెట్టినపుడు కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి కానీ..అన్ లాక్ 1లో కేసులు అంతకు రెట్టింపు పెరిగాయని ప్రజలు, నిపుణులంటున్న మాటలు వాస్తవమే. ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే అన్ని రకాల ప్రభుత్వోద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సడలింపులివ్వకముందే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాపారాలు, వివిధ ఉద్యోగ సంస్ధలకు సడలింపులిచ్చాయి. బతికుంటే బలుసాకు తినైనా బ్రతకొచ్చన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రభుత్వ ఆదాయం కోసం సడలింపులవైపు మొగ్గు చూపక తప్పలేదు.

అన్ లాక్ 1 లో భాగంగా కొన్ని రైళ్లు, ఇతర ప్రైవేట్ వాహనాలు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఒక రాష్ట్ర ప్రజలు ఇంకో రాష్ట్రంలోకి రావడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిజమే..ప్రైవేట్ వాహనాల్లో ఏమో గానీ..ఒక రైలు ఎక్కి ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకున్న వారిలో ఎక్కువ పాజిటివ్ కేసులొస్తున్నాయట. మరీ ముఖ్యంగా ఇప్పుడు వలస కూలీలు కరోనా వాహకాలుగా మారుతున్నాయి. వారికి చిన్న తుమ్మొచ్చినా, జలుబు చేసినా పెద్దగా పట్టించుకోకుండా ప్రయాణాలు చేస్తుండటంతో కరోనా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటోంది.

దేశంలో కరోనా దశల వారీగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వాతావరణానికి అనుకూలంగా దేశంలో 192 రకాల వైరస్ లుగా రూపాంతరం చెందుతోందని ఇటీవలే శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే కరోనా గురించి భయపడాల్సిందేమీ లేదని, రెండు నెలల్లో భారత్ కరోనా ఫ్రీ దేశంగా మారుతుందని కూడా చెప్తున్నారు కానీ..అవేమీ నిజమయ్యేలా లేవు. జూలై 15 నాటికల్లా దేశంలో 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వొచ్చన్న సంకేతాలు కూడా ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే లక్ష 11వేలకు పైగా కేసులుండగా..ఇప్పుడు తమిళనాడులో కూడా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి నెలాఖరు వరకూ చెన్నైలో పూర్తి లాక్ డౌన్ అమలు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం.

ఇప్పటి వరకూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యులు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో, ఇతర యాంటి బయోటిక్స్ తోనే వైద్యమందిస్తున్నారు. త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికా చెబుతోంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కఠిన నియమాలతో కూడిన లాక్ డౌన్ ను అమలు చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.

Next Story