కరోనా సోకిందని ఓ తండ్రి ప్రాణత్యాగం..
By తోట వంశీ కుమార్ Published on 24 March 2020 2:55 PM IST
కరోనా వైరస్ పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకు విభృంభిస్తోంది. కరోనా వైరస్(కొవిడ్-19) కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. రోడ్లపైకి ఎవరూ రావద్దని నిషేదాజ్ఞలు జారీ చేశాయి. అయినప్పటికి రోజు రోజుకు కరోనా బాధితులు పెరుగుతున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జలుబు, జ్వరం వస్తే.. తమకు కరోనా సోకిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఓ తండ్రి.. తన ద్వారా కరోనా వైరస్ పిల్లలకు ఎక్కడ సోకుతుందోనన్న ఆందోళనతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
మీరట్‌కి చెందిన ఓ సెలూన్ షాప్ యజమాని సుశీల్ కుమార్(32) గత కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా ఫలితం లేదు. దీంతో తనకు కరోనా సోకిందనే అనుమానం మొదలైంది. దీంతో అతడు కృంగిపోయాడు. కరోనా సోకిన వాళ్లలో జలుబు, పొడిదగ్గు, జ్వరం లక్షణాలు ఉంటాయని చెబుతుండడంతో తనకు కూడా కరోనా వైరస్ సోకిందని భయాందోళనకు గురయ్యాడు. తన నుంచి తన పిల్లలకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని భావించి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. షేవింగ్ బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కరోనా సోకిందన్న అనుమానంతోనే సుశీల్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కరోనా తన పిల్లలకు సోకకూడదన్న కారణంతో ప్రాణాలు వదిలేసిన తండ్రి సుశీల్ ఉదంతం స్థానికంగా కలచివేసింది.