రద్దీగా ఉండే నగరాలతోనే సమస్య పొంచి ఉందా..?

By అంజి  Published on  22 March 2020 12:09 PM GMT
రద్దీగా ఉండే నగరాలతోనే సమస్య పొంచి ఉందా..?

సోషల్ డిస్టెన్స్(సామాజిక దూరం) పాటించడం కారణంగా కరోనా మహమ్మారితో పోరాడవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా కొద్ది రోజుల పాటూ ఈ ప్రభావం చాలా మందిపై చూపించనుంది.. కానీ భారత్ లో సామాజిక దూరం ఎక్కువ రోజులు పాటించడం కష్టమే అంటున్నారు నిపుణులు. "సామాజిక దూరం అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరమే.. ఎందుకంటే ఈ వైరస్ ను ఆపడం అన్నది చాలా ముఖ్యం.. లేదంటే పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి" అని అంటున్నారు డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫామ్ ప్రాక్టో లో ఛీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ గా పనిచేస్తున్న అజెగ్జాండర్ కురువిల్ల.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ చెప్పేదేమిటంటే.. వైరస్ లక్షణాలైనటువంటి జలుబు, దగ్గు లాంటివి ఏ వ్యక్తికైనా ఉంటే కనీసం ఒక మీటరు దూరం అయినా ఉండాలని..! కానీ 1.4 బిలియన్ల జనాభా ఉన్నటువంటి భారత్ ఇప్పుడు సరికొత్త సమస్యను ఎదుర్కోబోతోంది.

అదేమిటంటే జనాభా సాంద్రత రేటు. భారత్ ఆ విషయంలో చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న టాప్ 25 దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్ లో ఒక చదరపు కిలోమీటరుకు 460 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. భారత జనాభా కొన్ని కొన్ని సార్లు చైనా జనాభాతో సరిపోలుస్తూ ఉంటారు. కానీ చైనా వైశాల్యం భారత్ కంటే ఎక్కువ.. అక్కడ ఒక చదరపు కిలోమీటరు కు 150 మంది కంటే తక్కువగానే ఉంటారు.

భారత్ మొత్తానికి చూస్తే జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 460 ఉండగా.. ఢిల్లీ, బీహార్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో జనాభా సాంద్రత అంతకు మించి ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు భారత్ లోనే అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు.. ఈ రాష్ట్రాల్లో జనాభా 40 కోట్ల పైగానే. ఈ రాష్ట్రాల్లో వరల్డ్ హెల్త్ ఆరగనైజేషన్ చెప్పినట్లు సామాజిక దూరం పాటించడం అన్నది.. అసలు కుదరని పని అంటున్నారు నిపుణులు.

సామాజిక దూరం వీలుపడుతుందా..?

ముఖ్యంగా భారత్ లో ఉన్న రవాణా వ్యవస్థ కారణంగా కూడా సామాజిక దూరం అన్నది వీలుపడదు. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మంది మధ్య తరగతి, పేద ప్రజలు సెకండ్ క్లాస్ రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతూ ఉంటారు. భారత్ లోని రైళ్లలో ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని డాక్టర్ ప్రియాంక సింగ్ తెలిపారు. నగరాల్లో కూడా చాలా మంది విపరీతమైన రద్దీ ఉన్న బస్సుల్లోనూ, లోకల్ ట్రైన్స్ లోనూ ప్రయాణిస్తూ ఉంటారని ఆమె తెలిపింది.

2017 లెక్కల ప్రకారం 23మిలియన్ల మంది 11000 ట్రైన్స్ లో ప్రతి రోజూ ప్రయాణిస్తూ ఉంటారు. ప్రజలకు మరే ఇతర వాహన సదుపాయాలు లేకపోవడంతో రైళ్లలో ఎక్కువగా ప్రయాణించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ ప్రబలడానికి రైళ్లు కూడా ముఖ్య కారణంగా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నారు నిపుణులు. కోవిద్-19 ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సామాజిక దూరం మాత్రమే కాదు.. పటిష్టమైన నిఘా వ్యవస్థ కూడా చాలా ముఖ్యమని అంటున్నారు నిపుణులు. చైనాలోని వుహాన్ లో వైరస్ ప్రబలిన సమయంలో అక్కడి అధికారులు రోగుల మీద, రోగం లక్షణాలు ఉన్న అనుమానితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. కొత్తగా యాప్స్ ఉంచి.. రోగుల మూమెంట్ పై కూడా అధికారులు నిఘా పెట్టారు.

మొబైల్ ఫోన్ ల మీద ప్రత్యేకంగా గ్రీన్, పసుపు, ఎరుపు లాంటి రంగులను ఉంచారు. దాని ద్వారా వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన స్టేటస్ అన్నది వెంటనే తెలిసిపోతుంది. దీంతో ట్రైన్ స్టేషన్స్ దగ్గర ఉన్న సిబ్బంది వారిని సులభంగా గుర్తించే వీలు ఉండేది.

ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న విధానం..

ఢిల్లీ లోని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లోని సీనియర్ హెల్త్ రీసెర్చర్ ఊమెన్ జాన్ మాట్లాడుతూ 'చైనాలో నివసిస్తున్న ఓ భారతీయుడు పలు విషయాలను బయట పెట్టాడు. బీజింగ్ నుండి హూబే ప్రాంతానికి ఆ వ్యక్తి వెళుతూ ఉండే వాడు. ఆ వ్యక్తి హూబేకు చేరుకోగానే అక్కడి అధికారులు అతడి మొబైల్ ఫోన్ లోకి ఓ యాప్ ను ఇచ్చారట.. సదరు వ్యక్తి.. ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అప్లోడ్ చేసే వాడు.. ఆ తర్వాత వైద్య సిబ్బంది వచ్చి ప్రతి రోజూ చెకప్ చేసే వాళ్ళని' అన్నారు.

భారత్ లో కూడా ఇలాంటి పద్ధతినే అవలంభించడం చాలా ముఖ్యమని అంటున్నారు ఆయన. ముఖ్యంగా ఎవరి ఆరోగ్య పరిస్థితి అయితే అత్యంత ప్రమాదకరంగా ఉంటుందో వాళ్ళను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకూ విదేశాల నుండి వచ్చిన వారు చెప్పినదాన్ని బట్టి వివరాలను సేకరిస్తున్నాం.. అలాగే థర్మల్ స్క్రీనింగ్ ద్వారా విదేశాలకు వెళ్లి వచ్చిన వారి హెల్త్ ను అంచనా వేస్తున్నామని అన్నారు. ఊమెన్ జాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఒక ఉదాహరణగా చూపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షల మందికి సంబంధించిన డేటా బేస్ ను రూపొందించిందని.. అందులో నుండి ఇటీవలి విదేశీ ప్రయాణాలు చేసొచ్చిన 7000 మందిని గుర్తించారని.. అలాగే వారికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారని జాన్ తెలిపారు. ఇలాంటి పద్దతే పలు రాష్ట్రాలు కూడా పాటించాలని ఆయన సూచించారు.

ఎక్కువగా ప్రజలు ఉన్న ప్రాంతాల్లో వైరస్ విస్తరించే అవకాశాలు

ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ముఖ్యంగా ఎక్కడైతే పరిశుభ్రత అన్నది లోపించి ఉండి ఉంటుందో అక్కడ వైరస్ విస్తరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నగరాల్లోని మురికివాడల్లో నివసించే వారికి కోవిద్-19 సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Next Story