‘కరోనా కేస్‌షీట్‌’ విషయం మాత్రం తేలడం లేదు..

By అంజి  Published on  15 March 2020 10:59 AM IST
‘కరోనా కేస్‌షీట్‌’ విషయం మాత్రం తేలడం లేదు..

హైదరాబాద్‌: తెలంగాణలో కొద్ది రోజుల కిందట మొదటి కరోనా వైరస్‌ సోకిన 24 సంవత్సరాల వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు. అతనికి గాంధీ ఆస్పత్రి వైద్యులు.. మెరుగైన సేవలందించి రోగాన్ని నయం చేశారు. రెండో టెస్టులో కూడా బాధితునికి నెగటివ్‌గా నిర్దారణ అయ్యింది. కాగా బాధితుడికి అందించిన వైద్య సేవలు, చికిత్స వంటి వివరాలను పొందుపర్చిన కేస్‌సీట్‌ వ్యవహరం ఇప్పుడు గాంధీ ఆస్పత్రి వైద్య బృందానికి తల నొప్పిగా మారింది.

మార్చి 1న వైరల్ న్యూమోనియా కారణంగా ఆ యువకుడు గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అంతకుముందు బాధితుడు దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చి అక్కడి నుంచి ఏసీ బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ తర్వాత నగరంలోకి మహేంద్ర హిల్స్‌కు చెందిన బాధితుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే గాంధీ ఆస్పత్రిలో చేరగా.. అతడిని వైద్యులు ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. చివరగా బాధితుడు కోలుకున్నాడు. అనేక పరీక్షల తర్వాత అతడికి కరోనా వైరస్‌ నెగిటివ్‌ అని తేలింది. కాగా బాధితుడిని ఈ నెల 13న రాత్రి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

కాగా ఇన్ని రోజుల పాటు బాధితునికి వైద్యులు వివిధ రకాల సేవలు అందించారు. చికిత్స, మందులు, ఫ్లూయిడ్స్‌, బీపీ, షుగర్‌ వంటి వివరాలన్నింటీని కేస్‌షీట్‌లో పొందుపర్చారు. రోగులను డిశ్చార్జ్‌ చేస్తే అతని కేష్‌షీట్‌ను 10 సంవత్సరాల పాటు భద్రపరచాలని నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు ఆయా కేస్‌షీట్లను గాంధీ ఆస్పత్రిలోని మెడికల్‌ రికార్డ్‌ రూమ్‌లో భద్రపరుస్తారు. అయితే తొలి కోవిడ్‌ బాధితుడి కేస్‌షీట్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేష్‌షీట్‌ కాగితాలపై కరోనా వైరస్‌ అంటుకొని ఉంటుందని, దానిని తాకితే అది ఇతరులకు కూడా వ్యాపించే అవకాశాలున్నాయని పలువురు అంటున్నారు.

కేస్‌షీట్‌ను ఒకవేళ జిరాక్స్‌ తీస్తే.. అది యంత్రాలకు పాకి.. ఆతర్వాత మనుషులకు వ్యాప్తిస్తుందని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుడి కరోనా కేస్‌షీట్‌ను ఏం చేయాలో తెలియక ఆస్పత్రి అధికారులు కింద మీద పడుతున్నారు. అయితే ఇప్పటికే బాధితుడు వాడిన చెప్పులు, టూత్‌బ్రష్‌, దుస్తులు, సిరంజీలు, సెలైన్‌ ప్లూయిడ్‌ బ్యాగ్‌లను బయో మెడికల్‌ వెస్టేజ్‌ ద్వారా నిర్వీర్యం చేశారు. ఇక మిగిలింది ఒక్క కేస్‌షీట్‌ విషయం మాత్రమే. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. కేష్‌షీట్‌ను పాలిథిన్‌ బ్యాగ్‌లో పెట్టి సీల్‌ చేయాలని, ఆ తర్వాత దానిపై వైరస్‌ నివారణకు ఉపయోగించి రసాయనాలను పూసి భద్రపర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Next Story