కరోనాపై యుద్ధం
By సుభాష్ Published on 4 March 2020 5:52 PM IST
దేశంలో కరోనా వైరస్ బుసలు కొడుతోంది. చైనాలో మొదలైన కరోనా వైరస్ దాదాపు 96 దేశాలకు చేరింది. ఇప్పటికే కరోనా కారణంగా 3వేలకు పైగా మృతి చెందారు. తాజాగా హైదరాబాద్‌లో కరోనా కేసు నమోదు కావడంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి సికింద్రాబాద్‌లోని మహేంద్రాహిల్స్ కు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ప్రజలు భయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఆ ప్రాంతమంతా పూర్తిగా నిర్మానుషంగా మారింది. మహేంద్రా హిల్స్ ప్రాంతంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం 40 పడకలను ఏర్పాటు చేశారు. మొత్తం 40 గంటల్లో 50కి పైగా కరోనా అనుమతి కేసులు నమోదయ్యాయి. వారందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.
అంతేకాకుండా ఢిల్లీలో కూడా ఓ కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. ఆగ్రాకు చెందిన వ్యక్తి కుటుంబ వేడుకల్లో పాల్గొనడంతో కుటుంబంలోని మరో ఆరుగురికి కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇక పరిస్థితి తీవ్రతరం కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ముమ్మరం చేస్తోంది. అటు ప్రధాని నరేంద్రమోదీ కూడా బహిరంగ సభలు, హోలీ వేడుకలను సైతం రద్దు చేసుకున్నారు. ఇక ఈనెల 15వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రావాల్సి ఉండగా, ఆయన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
కరోనాపై యుద్ధం
భారత్‌లో కరోనా వైరస్ కలకలం రేపడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులకు అప్రమత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు కోసం హైదరాబాద్‌లో రెండు చోట్ల స్థలాలను పరిశీలిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కరోనా కోసం ప్రత్యేక నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
భారత్‌లో ఇప్పటి వరకు 28 పాజిటివ్ కేసులు
భారత్‌లో ఇప్పటి వరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో కరోనా కేసులను గుర్తించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెబుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని తెలిపింది.