తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. కమ్యూనిటీ స్ప్రెడ్ షురూ
By తోట వంశీ కుమార్ Published on 23 July 2020 1:15 PM GMTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ వ్యాప్తి) ప్రారంభమైందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరబాద్‌లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికి ద్వితియ శ్రేణి నగరాల్లో వైరస్ విస్తరిస్తోందన్నారు. రానున్న నాలుగు, ఐదు వారాలు చాలా క్లిష్టంగా ఉంటాయని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయని, లక్షణాలు లేనివారు కరోనా పరీక్షల కోసం రావొద్దని, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని, వైద్య సిబ్బంది చాలా ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. జిల్లాల్లో సైతం పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలు చేస్తున్నామని.. కరోనా లక్షణాలు ఉన్న వారు ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదని హెచ్చరించారు. త్వరగా చికిత్స అందిస్తే ప్రాణాపాయం బయటపడొచ్చునని వెల్లడించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిందని, వైద్య శాఖలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. కరోనా బారీన పడిన వాళ్లలో 99శాతానికి పైగా రికవరీ అవతున్నారని తెలిపారు. 70శాతం మంది కరోనా రోగులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు 50 వేలకు చేరువయ్యాయి. బుధవారం రాత్రి నాటికి గడిచిన 24 గంటల్లో మొత్తం 30 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా 1,554 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49,259కు చేరింది. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 842, రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 96, కరీంనగర్‌లో 73, నల్లగొండలో 51, వరంగల్ అర్బన్‌లో 38, వరంగల్ రూరల్‌లో 36, ఖమ్మంలో 22 కేసులు నమోదయ్యాయి. మరో తొమ్మిది మంది మృతితో మొత్తం మరణాలు 438కు చేరాయి.