అవనిగడ్డ విద్యార్థినికి 'కరోనా' సోకలేదట.. ఎందుకంటే..
By అంజి
కృష్ణా: జిల్లాలోని చైనా నుంచి వచ్చిన ఓ విద్యార్థినికి కరోనా వైరస్ సోకినట్లుగా వస్తున్న వార్తల ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఆ విద్యార్థినికి ఎలాంటి వైరస్ సోకలేదని జిల్లా వైద్యాశాఖధికారులు తెలిపారు. ఈ నెల 12 చైనా నుంచి ఓ వైద్య విద్యార్థిని తన సొంతూరైన అవనిగడ్డకు వచ్చింది. ఆ విద్యార్థిని చైనాలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలు కరోనా వైరస్‌పై అలర్ట్ అయ్యాయి. చైనా నుంచి వచ్చే వాళ్లు వెంటనే తెలపాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డలో చైనా నుంచి వచ్చిన విద్యార్థిని వివరాలు తెలిశాయి. అమెకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కృష్ణా జిల్లా వైద్యాధికారి టి.ఎస్.ఆర్ మూర్తి తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో ఎవరికి కూడా కరోనా వైరస్ సోకినట్లు కేసులు నమోదు కాలేదన్నారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో రోజు రోజుకు కరోనా వైరస్ అనుమానిత వ్యక్తుల కేసులు పెరుగుతున్నాయి. నాలుగు నగరాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఇప్పటికే కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, అలిప్పీ, ముంబై, బెంగళూరు నగరాలను చేర్చింది. కొత్త తరహా వైరస్ కావడం.. డాక్టర్ల సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి పుణెలో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన కిట్లను ప్రభుత్వం వివిధ నగరాల్లోని ప్రయోగాశాలలకు పంపనుంది.
కరోనా వైరస్ బారిన పడ్డ చైనా దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను, ఇతరులను తీసుకు వచ్చే బాధ్యతను భారత ప్రభుత్వం తన భుజానికెత్తుకుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం భారతీయ మూలానికి చెందిన విద్యార్థులు, కార్మికులు, ఇతరులను తరలించే విషయంలో సహకరించాల్సిందిగా చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ కథనం ప్రకారం మరో వారం రోజుల్లో భారతీయులను తీసుకురావడం జరుగుతుంది.