తెలంగాణలో 154కి చేరిన కరోనా కేసులు..

By అంజి  Published on  2 April 2020 4:29 PM GMT
తెలంగాణలో 154కి చేరిన కరోనా కేసులు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 154కి చేరింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో చాలా మందికి కరోనా వైరస్‌ సోకడంతో.. వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇవాళ ముగ్గురు కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 17కు చేరగా.. మృతుల సంఖ్య 9కి చేరింది. నల్గొండ జిల్లాలో ఆరు కరోనా కేసులు, సంగారెడ్డిలో ఆరు కరోనా కేసులు, ములుగులో రెండు కరోనా కేసులు నమోదు అవగా.. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 154కి చేరింది. ప్రస్తుతం 128 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఢిల్లీ మర్కజ్‌కి వెళ్లొచ్చిన వారిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే చాలా మందిని గుర్తించి.. వారిని క్వారంటైన్‌ కేంద్రాలను తరలించారు అధికారులు. రాష్ట్రంలో ఎక్కువ కేసులు మర్కజ్‌ వెళ్లొచ్చిన వారి ద్వారానే నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మర్కజ్‌కి వెళ్లిన వారిని, వారి కుటుంబ సభ్యులు అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు జరుపుతున్నారు.

రేపటి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే రెండేళ్లు జైలు శిక్ష ఉంటుందని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు 2,069 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 156 మంది కోలుకోగా.. 53 మంది మృతి చెందినట్టు తెలిపింది.

Next Story
Share it