తిరుపతిలో కరోనా వైరస్ కలకలం.. రుయాలో చేరిన తైవాన్‌ వాసి

By అంజి  Published on  1 March 2020 3:51 AM GMT
తిరుపతిలో కరోనా వైరస్ కలకలం.. రుయాలో చేరిన తైవాన్‌ వాసి

ముఖ్యాంశాలు

  • తిరుపతిలో కరోనా కలకలం
  • రుయా ఆస్పత్రిలో కరోనా అనుమానిత కేసు
  • తైవాన్‌ నుంచి తిరుపతికి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు

చిత్తూరు: తిరపతిలో ఓ అనుమానిత కరోనా వైరస్‌ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌ లక్షణాలతో తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి రుయా ఆస్పత్రిలో చేరాడు. తైవాన్‌ దేశం నుంచి ఫిబ్రవరి 17న చెన్‌ చున్‌ హాంగ్‌ భారత్‌కు వచ్చాడు. 35 సంవత్సరాలు చెన్‌ చున్‌ హాంగ్‌.. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం ఇక్కడి వచ్చాడు. ప్రస్తుతం అతడిని రుయా ఆస్పత్రి వైద్యులు కరోనా ఐసోలేటెడ్‌ వార్డులో ఉంచారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. మరో రెండు రోజుల్లో అతడికి కరోనా వైరస్‌ ఉందా లేదా అన్న విషయాన్ని వైద్యులు తేల్చనున్నారు. ఈ ఘటనతో తిరుపతిలోని ప్రజల్లో భయం పట్టుకుంది.

ఇప్పటికే 57 దేశాలకు వ్యాపించిన కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అనేక దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే దీనికి వ్యాక్సిన్‌ కనుగొనేందుకు వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 83 వేల మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది.

మార్చి6వ తేదీన ఢిల్లీలో కరోనా వైరస్‌పై అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శిక్షణ ఇవ్వబోతుంది. కాగా రాష్ట్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సీనియర్‌ వైద్యులు సావిత్రి, నీలిమ, రాంబాబు, ప్రశాంతి ఈ శిక్షణలో పాల్గొననున్నారు.

కరోనా వ్యాప్త తర్వాత 187 మంది విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి కరోనా వైరస్‌ కేసు నమోదు కాలేదు.

Next Story