క‌రోనాను పూర్తిగా నియంత్రించ‌లేం.. అదొక్క‌టే మార్గం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 April 2020 4:36 AM GMT
క‌రోనాను పూర్తిగా నియంత్రించ‌లేం.. అదొక్క‌టే మార్గం..!

క‌రోనా.. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న పేరు. ల‌క్ష‌ల మంది జీవితాల్లో చీక‌టిని నింపిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌పంచం మొత్తాన్ని ఎక్క‌డిక‌క్క‌డే క‌ట్టిప‌డేసింది. దీంతో ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు కావ‌ల్సిన వ్యాక్సిన్, ఇత‌ర‌త్రా నివార‌ణ చ‌ర్య‌లు క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శాస్త్ర‌వేత్త‌లు, వైద్య నిపుణులు రంగంలోకి దిగారు. అయితే.. ఆ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతుండ‌గానే.. వైర‌స్ పుట్టిల్లు చైనాకు.. చెందిన వైద్య‌శాస్త్ర నిపుణులు మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ఈ విష‌య‌మై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌పుతున్న చైనాలోని అత్యున్నత పరిశోధన సంస్థ పాథోజెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జిన్ మాట్లాడుతూ.. క‌రోనాను పూర్తిగా రూపుమాపలేమని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 సీజనల్‌ ఫ్లూ మాదిరిగా ప్రతి సంవ‌త్స‌రం దాని ఉనికి చూపెడుతుందని అన్నారు. మనిషి జీవితంలో సుదీర్ఘకాలంపాటు ఈ వైర‌స్‌‌ ఉంటుందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

Advertisement

ఇక ఇదే విష‌య‌మై ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్న‌ అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్చువస్‌ డైరెక్టర్‌ ఆంథోని ఫాసీ కూడా చైనా వైద్య నిపుణులు వెల్ల‌డించిన అభిప్రాయాన్నే వ్యక్త ప‌రిచారు. కరోనా శీతాకాలంలో ఫ్లూగా మానవ జీవితంలో భాగమవుతుందన్నారు.

ఇక ప్రపంచ మానవాళిపై సార్స్‌-కోవ్‌-2 త‌న ప్ర‌తాపం చూపుతుంద‌ని భారత్‌లోని వైద్యశాస్త్ర నిపుణులు కూడా అంటున్నారు. త్వ‌ర‌గా అతి ఎక్కువ మందికి చేరే అవ‌కాశం ఉన్న కరోనా‌ చాలాకాలం మనుగడలో ఉంటుందని అంటున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులను గుర్తించడం కష్టమని.. వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుంద‌ని అంటున్నారు.

Advertisement

ఇదిలావుంటే.. వైరస్‌కు గురైన వ్యక్తులలో తొలివారం లక్షణాలు బయటపడకపోవడం.. దాదాపు 44 శాతం వైరస్‌ వ్యాప్తి అలాంటి కేసుల వల్లే జరగుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అలాగే రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులపై కోవిడ్‌ మళ్లీ మళ్లీ దాడి చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే.. వీట‌న్నింటికీ స‌మ‌ర్థ‌వంత‌మైన‌ వ్యాక్సిన్ క‌నిపెట్ట‌డం ద్వారా నియంత్రించ‌వ‌చ్చని నిపుణులు అంటున్నారు.

Next Story
Share it