భారత్‌లో కరోనా విలయం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 5:46 AM GMT
భారత్‌లో కరోనా విలయం..

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం 80వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 86,821 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,12,585 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 52,73,202 మంది కోలుకోగా.. 9,40,705 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1,181 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 98,678 కి పెరిగింది.

నిన్న ఒక్కరోజులోనే 14,23,052 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 7,56,19,781 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.53 శాతం ఉండగా.. మరణాల రేటు 1.56శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకునే వారి సంఖ్య క్రమంగా పెరగడం ఊరట కలిగించే విషయం. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది.

Next Story