కాటేస్తోన్న కరోనా....
By రాణి Published on 24 Jan 2020 11:01 AM GMTచైనా దేశస్తులను ప్రస్తుతం వణికిస్తున్న వైరస్ కరోనా. ఇప్పటి వరకూ కరోనా కాటుకు గురై 17 మంది చనిపోగా..గురువారం బీజింగ్ సమీపంలోని ఉత్తర హెబెయ్ ప్రావిన్స్ లో మరొకరు మృత్యువాత పడటంతో మృతుల సంఖ్య 18కి చేరింది. అసలు ఈ కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది ? ఏ జంతువు ద్వారా ఈ వైరస్ ప్రబలుతుంది ? ఈ వైరస్ కు మందు ఉందా లేదా ? ఈ విషయాలపై మాకు తెలిసిన పరిజ్ఞానంతో ఇస్తున్న సమాచారం ఇది.
కరోనా...చైనా తో పాటు భారతాన్ని కూడా వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధి. నిన్న మొన్నటి వరకూ స్వైన్ ఫ్లూ. అంతకుముందు ఎబోలా. ఇలా ఏడాదికొక కొత్త వైరస్ పుట్టుకొస్తుంది. కరోనా విషయానికొస్తే...ఇది పాములు లేదా గబ్బిలాల నుంచి మనుషుల్లోకి ప్రవేశించినట్లు వైద్య శాస్ర్తవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో రకరకాల ప్రాణుల్ని అక్రమంగా విక్రయించే టోకు మార్కెట్ కు వచ్చినవారి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లుగా భావిస్తున్నారు శాస్ర్తవేత్తలు.
జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీలో ప్రచురితమైన వివరాలను బట్టి.. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ క్రమంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్ లాండ్, జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు సోకింది. అయితే గతంలో వచ్చిన ఒక వైరస్ కూడా కరోనాగానే గుర్తించారు. ఆ వైరస్, ఈ వైరస్ మధ్య ఏం తేడాలున్నాయన్న దానిపై అధ్యయనం చేశారు. గబ్బిలాలు లేదా పాముల వల్లనే ఈ కొత్తరకం వైరస్ వ్యాపిస్తున్నట్లుగా భావిస్తున్నారు. చైనాలో ఈ వైరస్ సుమారు 4000 మందికి వ్యాపించి ఉంటుందని లండన్ ఇంపీరియల్ కాలేజ్ సైంటిస్టుల అంచనా. కరోనా అనే పేరుకు ముందు 2019 - ఎన్ సీవోవీ అని నామకరణం చేశారు. తుమ్ములు, దగ్గు ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని, కాబట్టి అందరూ జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ముక్కు, నోటికి కలిపి మాస్క్ లు ధరించడం చాలా ఉత్తమం అని పేర్కొంటున్నారు.
వైరస్ వల్ల ఆంక్షలు
కరోనా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తుండటంతో..హుబెయ్ ప్రావిన్స్ లోని వుహాన్, హుయాంగ్ గాంగ్, ఎఝౌ, ఝిజియాంగ్, ఖియాన్ జింగ్ నగరాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. హుయాంగ్ గాంగ్, వుహాన్ నగరాల నుంచి బయల్దేరే రైళ్లు, బస్సులను సైతం నివధికంగా నిలిపివేశారు అధికారులు. మార్కెట్లు, సినిమా హాళ్లు, ఇంటర్నెట్ సెంటర్లు ఇలా..నగరాల్లోని అన్ని దుకాణాలు మూతపడ్డాయి. అత్యవసరమైతే తప్ప నగరం దాటి వెళ్లరాదని, ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమవ్వాల్సిందిగా సూచించారు. ఇదిలా ఉంటే..చైనా నూతన సంవత్సర వేడుకలు కూడా రద్దయ్యాయి. చైనా క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ ప్రారంభమయ్యే వారంరోజుల ముందు నుంచి అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి ఈ వేడుకలు కూడా రద్దయ్యాయి. వాస్తవానికి శుక్రవారం నుంచి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కావాల్సి ఉంది.
చైనా నుంచి కరోనా వైరస్ తమ దేశాలకు వ్యాపించకుండా ఇండియా సహా ఇతర దేశాలు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశాయి. ప్రాణాంతకమైన కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు గానీ..ప్రవాస భారతీయుల కోసం భారత దౌత్య కార్యాలయ వర్గాలు రెండు హాట్ లైన్లను ఏర్పాటు చేశాయి. ఎప్పటికప్పుడు తాము ఇచ్చే సమాచారాన్ని న్యూస్ ఛానెల్స్ ద్వారా చూడాల్సిందిగా కార్యాలయ వర్గాలు కోరాయి. అలాగే ఆంక్షలు విధించిన నగరాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఆహారం అందించేందుకు అన్నిరకాలుగా సహాయం అందిస్తామని చైనా అధికార వర్గాలు వెల్లడించాయి.
చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇండియాకు విమానాల్లో వచ్చిన 12,828 మందికి దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాలైన ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికులెవరికీ కరోనా వ్యాధి లక్షణాలు లేవని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా..ముంబై విమానాశ్రయంలో మాత్రం ఇద్దరికి దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో వారిద్దరినీ అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలిసింది. అలాగే కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సహా 6 రాష్ర్టాలకు మంత్రిత్వ శాఖ లేఖలు రాసి పంపింది. ఇటీవలే సౌదీ అరేబియాలో ఉంటున్న కేరళ నర్సుకు కరోనా సోకినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా..ఆమెకు వైద్యపరీక్షలు చేసిన కింగ్ డమ్ ఆమెకు ఎలాంటి వైరస్ సోకలేదని నిర్థారించింది.
కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు
గొంతు, ముక్కు వాపు ఉండటం
పొడి దగ్గు, సాధారణ జ్వరం.
అయితే ఈ లక్షణాలు సాధారణ జీవనంలో వచ్చేవే. కాకపోతే ఇవి ఆ వ్యాధి వల్ల వచ్చాయా లేదా అన్న విషయం గ్రహించాల్సి ఉంటుంది.