కరోనా వ్యాక్సిన్.. ప్రపంచ దేశాధినేతల చూపు మొత్తం ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి లోపు వచ్చేస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పై ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి. ఒక్కో చోట ఒక్కో దశలో నడుస్తోంది. వ్యాక్సిన్ అంటే చాలు భారత్ వైపు చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. భారత్ కు చెందిన ఫార్మా కంపెనీలు కూడా వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ పై తాజాగా సమీక్ష నిర్వహించారు. మంగళవారం నాడు టాస్క్ ఫోర్స్ టీమ్ తో సమీక్ష నిర్వహించిన ఆయన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, వ్యాక్సిన్ కోసం చేస్తున్న ప్రయోగాలు ఏమయ్యాయి, ఏ దశలో ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా భారత్ లో ప్రయోగాలు ఏ దశకు వచ్చాయి అన్నదానిపై ఆయన పూర్తిగా సమీక్షించారు.

30కి పైగా భారత వ్యాక్సిన్లపై ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని హ్యూమన్ ట్రయల్స్ లో కూడా ఉన్నాయని మోదీకి అధికారులు తెలిపారు.

వ్యాక్సిన్ తయారీ ప్రక్రియకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్‌, డ్రగ్స్ తయారీ, చికిత్స, టెస్టింగ్ వంటి అంశాలపై ఆ రంగంలో అత్యంత ప్రతిభావంతులతో మాట్లాడుతూ అందరూ కలిసి వేగంగా, అత్యంత సమర్థమైన మందును తయారుచెయ్యాలని కోరారు. సైన్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ రంగాలు పూర్తి సామర్ధ్యంతో పనిచేస్తూ వ్యాక్సిన్ తయారీ చేపట్టాలని కోరారు. ఏవైనా ఆవిష్కరణలు చేయడంలో భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభ గొప్పదని.. ఇటువంటి సమయాల్లోనే మన ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో విజయవంతమైన వారు స్టార్టప్ లను కూడా మొదలుపెట్టాలని.. తమ ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని అన్నారు మోదీ. సంక్షోభ సమయాల్లో సుసాధ్యమైన విషయాలే రోజువారీ జీవనంలోనూ భాగంగా మారాలి అని అన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.