తెలంగాణకు వచ్చిన మెషీన్ ను కోల్ కతాకు తీసుకెళ్లిపోయారా?

By సుభాష్  Published on  22 Jun 2020 4:50 AM GMT
తెలంగాణకు వచ్చిన మెషీన్ ను కోల్ కతాకు తీసుకెళ్లిపోయారా?

తెలంగాణ కోసం తెప్పించిన అధునాతన యంత్రంపై కేంద్రం కన్ను పడిందా? అంటే అవునని చెబుతున్నారు. మహమ్మారి నిర్దారణ కోసం చేసే పరీక్షల ఫలితాలు ఒకేసారి పెద్ద ఎత్తున తేల్చే అత్యాధునిక మెషీన్ కోబాస్ 8800గా చెబుతారు. ఈ యంత్రం సాయంతో రోజుకు ఐదు వేల నిర్దారణ పరీక్షలు చేసే వీలుంది. ఈ మెషీన్ అందుబాటులోకి రావటం ద్వారా.. నిర్దారణ పరీక్షలు పెద్ద ఎత్తున చేయటం లేదన్న విమర్శలకు చెక్ పెట్టొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

సీఎస్ఆర్ కింద అదేనండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ కింద ఈ యంత్రాన్ని రాంకీ సంస్థ తెలంగాణకు తీసుకొచ్చేందుకు ఆర్డర్ చేశారు. అమెరికాలోనిరోచే కంపెనీ దీన్ని తయారు చేసింది. దాదాపు రూ.7 కోట్లు విలువ ఉండే ఈ యంత్రం చెన్నైకు చేరుకుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కు రావాల్సి ఉంది. అదే సమయంలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమని సుధామూర్తి కూడా తెలంగాణకు ఇదే తరహా మెషీన్ ను బుక్ చేశారు. హైదరాబాద్ కు చెందిన మరో ప్రైవేటు సంస్థ కూడా ఈ మెషీన్ ను ఆర్డర్ చేసింది. ఈ మూడు కానీ రాష్ట్రానికి చేరితే రోజుకు పదిహేను వేల పరీక్షలు చేసే వీలుంది.

అయితే.. చెన్నైకి చేరిన కోబస్ మెషీన్ తమకు కావాలని కేంద్రం పట్టుబట్టి మరీ కోల్ కతాకు తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చిన మెషీన్ ను కోల్ కతాకు తీసుకెళ్లే విషయంలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందని.. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం హుందాగా వ్యవహరించినట్లుగా ఈటెల వ్యాఖ్యానించటం గమనార్హం.

తెలంగాణతో పోలిస్తే.. కోల్ కతాలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వారికి ఆ మెషీన్ తో అవసరం ఎక్కువగా ఉంటుందన్న మాట కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావటంతో.. తెలంగాణకు రావాల్సిన మెషీన్.. కోల్ కతాకు వెళ్లిపోయింది. అయితే.. ఈ విషయాలన్ని బీజేపీ నేత నడ్డా తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన క్రమంలోనే రావటం గమనార్హం. ఈ లెక్క ఏమిటో తేలాలంటే బీజేపీ నేతల వెర్షన్ తెలిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Next Story