తెలంగాణను దెబ్బేసిన లాక్ డౌన్ సడలింపు

By సుభాష్  Published on  15 Jun 2020 7:44 AM GMT
తెలంగాణను దెబ్బేసిన లాక్ డౌన్ సడలింపు

రోజుకు ఇరవై ముప్పై. చూస్తుండగానే యాభై.. అరవై పాజిటివ్ లు. ఈ అంకెలకే గుండెలు అదురుతున్న వేళ.. జోరు మరింత పెరిగింది. చూస్తున్నంతనే రోజుకు వంద కాస్తా రెండు వందలకు చేరుకోవటంతో మొన్నటివరకూ తెలంగాణలో కేసుల సంఖ్య పరిమితంగా ఉందన్న భావనకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిస్థితి తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

కరోనాకి లాక్ డౌన్ కు మించి మందు లేదన్న సూత్రాన్ని నమ్ముతూ.. దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు ముందే తెలంగాణలో విధించారు. దీంతో మిగిలిన రాష్ట్రాల కంటే జోరు తక్కువగా కనిపించింది. మొదట్లో పోలీసులు.. అధికారులు వ్యవహరించిన తీరు కూడా కేసులు పెరగకుండా కట్టడి చేయగలిగింది. ఎప్పుడైతే లాక్ డౌన్ సడలింపులు మొదలయ్యాయో.. పరిస్థితిలో మార్పు రావటమే కాదు.. కేసులజోరు రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తోడు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది.

మే ఆరు వరకు తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 1094 మాత్రమే. మరణాలు కూడా 29కే పరిమితమయ్యాయి. అనంతరం.. సడలింపు చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల్లో పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయి. కేవలం 37రోజుల వ్యవధిలో నమోదైన కేసులు 3880కావటం గమనార్హం. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా 4974 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 185 మరణాలు చోటు చేసుకున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితి ఇదే తీరులో కొనసాగితే.. మరికొద్ది రోజుల్లో రోజుకు 500 నుంచి వెయ్యి వరకూ కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు.. పోలీసులు.. మీడియాకు చెందిన పలువురు పాజిటివ్ గా తేలుతున్న వైనం ఇప్పుడు కొత్త ఆందోళనకు తెర తీస్తోంది. ఇదంతా చూసినప్పుడు లాక్ డౌన్ సడలింపులు తెలంగాణలో కేసుల వ్యాప్తికి కారణమైందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరిప్పుడేం చేయాలన్న ప్రశ్నకు.. ప్రజలంతా ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరించటానికి మించిన మందు మరింకేం లేదని చెప్పాలి.

Next Story