పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెతో ఊరికి కరోనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 6:42 AM GMT
పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెతో ఊరికి కరోనా?

కరోనా వేళ.. తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా.. కొందరి తీరుతో ఎలాంటి ప్రయోజనం ఉండకపోవటమే కాదు.. కొత్త తిప్పలు ఎదురవుతున్నాయి. తాజగా అలాంటి ఉదంతమే ఒకటి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళ.. ఇప్పుడా చిన్న ఊరిలో కరోనాను అంటించేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలేమంటే..

నిజామాబాద్ జిల్లా బోధన్ పరిధిలో చెక్కి క్యాంప్ అనే చిన్న గ్రామం ఉంది. ఆ ఊళ్లో 193 ఇళ్లు ఉన్నాయి. ఇప్పుడా ఊరు జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఆ చిన్న ఊరిలో ఇప్పుడు ఒక్కసారిగా కరోనా కేసులు భారీగా నమోదు కావటంతో ఊరంతా ఆగమాగంగా మారింది. పది రోజుల క్రితం ఆ ఊళ్లో ఒక పెళ్లి జరిగింది. కరోనా వేళలో.. జాగ్రత్తలతో సింఫుల్ గా పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నారు.

పెళ్లికి హాజరైన వారిలో ఒక మహిళ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆమె కారణంగా.. ఇప్పుడా పెళ్లికి హాజరైన వారిలో యాభై మందికి పాజిటివ్ గా తేలింది. ఊళ్లోని 193 ఇళ్లలో 42 ఇళ్లలోని యాభై మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. బాధితుల జాబితాలో పెళ్లికొడుకు.. పెళ్లి కుమార్తె కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పెళ్లికి హాజరైన వారంతా.. క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

దీంతో.. ఊళ్లోని చాలా ఇళ్లలో అయితే కరోనా పేషెంట్.. లేదంటే హోం క్వారంటైన్ అన్నట్లుగా మారింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక మహిళ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అభిప్రాయ పడుతున్నారు. అయినా.. పెళ్లిని సింపుల్ గా చేయాల్సింది పోయి.. హడావుడిగా చేయటం ఎందుకు? ఇలాంటి తిప్పలు తెచ్చుకోవటం ఎందుకన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Next Story