ఇదేం ఖర్మరా బాబు.. చెబితే పరువు పోతుంది.. చెప్పకుంటే కరోనాతో పోయేలాగా ఉన్నాం
By తోట వంశీ కుమార్ Published on 28 April 2020 1:21 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పేరు ఎత్తితే చాలు.. భయపడి పోయే పరిస్దితులు ఉన్నాయి. అయితే.. కరోనా ఎక్కడ తమ కాపురాల్లో చిచ్చుపెడుతోండని కొందరు తెగ భయపడిపోతున్నారట. కరోనా వల్ల వివాహేతర సంబంధాలు బయటపడే పరిస్థితి వచ్చిందట. అదేంటీ..? కరోనా వల్ల ఆ సంబంధాలు బయట పడడం ఏంటీ అనేగా మీ సందేహాం. అయితే.. ఓ సారి ఇది చదవండి.
కరోనా వైరస్ అంటువ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఎప్పుడో ప్రకటించింది. ఒకరి నుంచి మరోకరికి వేగంగా విస్తరిస్తోంది. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలితే.. ఆ వ్యక్తిని ఐసోలేట్ చేయడంతో పాటు ఆ వ్యక్తితో సన్నిహిత మెలిగిన వారి వివరాలను అధికారులు సేకరించి.. వారికి పరీక్షలు చేయడంతో పాటు వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు అధికారులు. ఇప్పుడు ఇదే.. ఆ సంబంధాలు కొనసాగిస్తున్న వారి పట్ల శాపంగా మారిందట.
ఇటీవల భోపాల్‌లోని ఓ యువతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ యువతి ప్రైమరీ కాంటాక్టుల వివరాలను పోలీసులు ఆరాతీశారు. తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే విషయం చెప్పింది. అక్కడే ఉన్న ఆ యువతి తల్లిదండ్రులు.. కూతురి చెప్పింది విని షాకైయ్యారు. ఆ యువతికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం.. అతడితో ఆమె సన్నిహితంగా మెలిగిన విషయం వారికి తెలియదు. ఆమె బాయ్‌ఫ్రెండ్ పరీక్షలు చేయగా.. అతడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇక.. భోపాల్ పట్టణానికే చెందిన మరో యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతని ప్రైమరీ కాంటాక్టుల వివరాలు అడగ్గా.. గర్ల్‌ఫ్రెండ్ విషయం చెప్పాడు. ఈ సారి షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. ఎందుకంటే.. ఎందుకంటే ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరా అని ఆరా తీసిన పోలీసులకు ముందుగా మరో బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పిన యువతి, ఆ యువతి ఒక్కతేనని తెలిసింది. దీంతో ఆ యువతి ఒకరికి తెలియకుండా ఒకరిని ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌ను మెయింటెన్ చేస్తున్నదన్న విషయం బయటపడింది.
ఇక కర్ణాటకలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. ఓ సంస్థలో పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతన్ని ఆస్పత్రికి తరలించి.. ఆ సంస్థలోని ఉద్యోగులతో పాటు.. కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. అందరికి కరోనా నెగిటివ్ వచ్చింది. ఆ వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందని ఆరా తీయగా.. ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉందని బయటపడింది. వెంటనే అధికారులు ఆవివాహిత ఇంటికి వెళ్లి ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో వివాహిత వివాహేతర సంబంధం బయటపడడంతో ఆమె పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఈ రెండు ఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే.
కరోనా పుణ్యమా అని ఇలాంటి సంబంధాలెన్నో బయటకు వస్తున్నాయి. తమ సంబంధం గురించి చెబితే.. ఇంట్లో పరువు పోతుంది చెప్పకుండా కరోనాతో పోతాం అని ఎందరో తమలో తాము మదనపడుతున్నారట.