వేగంగా కోలుకుంటున్నారు..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  19 Aug 2020 10:38 AM GMT
వేగంగా కోలుకుంటున్నారు..!

  • యాంటీబాడీస్‌ వృద్ధిలో పూణే ఫస్ట్‌
  • కరోనాపై సెరాలజీ సర్వే వెల్లడి

మన దేశంలో ఓ వైపు కరోనా పడగ విప్పి బుసలు కొడుతున్నా.. మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దగ్గరదగ్గర 58 వేలమంది కోలుకోవడం ఓ రికార్డు. మరోవైపు కొత్తగా 55వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా 51,797 మంది కరోనా బారిన పడి మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశంలో కరోనా యాక్టివ్‌ల సంఖ్య 6లక్షల 70వేల పైచిలుకుగా ఉంటోంది. రికవరీ రేటు 73.18 శాతం అయితే మరణాల రేటు 1.92 శాతంగా ఉంటోంది. కేంద్ర,రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది.

గత ఏప్రిల్‌లో కోలుకున్న వారి రేటు 7.35 శాతంగా ఉంటే ప్రస్తుతం ఏకంగా 73.18 శాతానికి పెరగడం గమనార్హం. రోజుకు 7 నుంచి 8లక్షల దాకా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలతో వ్యాధిని ముందుగానే అరికట్టే వీలుంది. ఈ కరోనాకు విరుగుడుగా యాంటీ బాడీస్‌ కూడా వేగంగా వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది.

సెరాలజీ పలు రాష్ట్రాల్లో చేపట్టిన సర్వే ప్రకారం చాలామందికి కరోనా వచ్చి పోయిన విషయం కూడా తెలీడం లేదని తెలుస్తోంది. అంతకన్నా వేగంగా శరీరంలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతున్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌ కరోనాను సమర్థంగా ఎదుర్కొంటోంది.

లండన్‌లో సెరాలజీ సర్వే నిర్వహిస్తే కేవలం 17.5 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు వృద్ది చెందినట్లు తెలుస్తోంది. పూణేలో సర్వే నిర్వహిస్తే 51.5 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. ఇక ముంబై ధారావితో పాటు పలు మురిదకి వాడల్లో సర్వేలు చేయగా 6 వేల మందిలో 57శాతం మందికి వారికి తెలీకుండానే కరోనా సోకి నయమైనట్లు తేలింది.

ఇప్పటి వరకు స్లమ్స్‌లో ఉన్నవారికే అధికశాతంగా దాదాపు 62శాతం మందికి యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు సీరో పరిశీలనలో తేలింది. అపార్ట్‌మెంట్‌ వాసుల్లో కేవలం 33 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందాయి. మహిళల కంటే పురుషుల్లోనే ఈ యాంటీ బాడీలు ఎక్కువగా పెరుగుతున్నాయని పరిశీలనలో తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌లో మరో అడుగు పడింది. త్వరలో టీకా మూడోదశ ప్రయోగాలు సురూ అవుతాయని నీతి అయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు.

Next Story
Share it