మనకు ఎన్ని టీకాలు అవసరం అవుతాయో లెక్క తేల్చారు

By సుభాష్  Published on  19 Aug 2020 4:57 AM GMT
మనకు ఎన్ని టీకాలు అవసరం అవుతాయో లెక్క తేల్చారు

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 వ్యాక్సిన్ కు సంబంధించి జోరుగా పరిశోధనలు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. వీటిల్లో ఐదు సంస్థలు నిర్వహిస్తున్న ప్రయోగాల మీద ప్రపంచం భారీగా ఆశలు పెట్టుకున్నాయి. దీనికి తగ్గట్లే పలు దేశాలు.. ఆయా సంస్థలతో ముందస్తుగా ఒప్పందాలు చేసుకోవటం.. వ్యాక్సిన్ తయారైన వెంటనే.. తమకెన్ని టీకాలు కావాలన్న దానిపైనా ఒక అవగాహనకు వచ్చి.. ముందస్తుగా బుక్ చేసుకోవటం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా పలుదేశాలు పోటాపోటీగా వ్యాక్సిన్ ను బల్క్ గా బుక్ చేసుకోవటం.. అందుకు తగ్గట్లుగా ఒప్పందాలు చేసుకుంటూ ఉంటే.. భారత్ మాత్రం ఇప్పటివరకు అలాంటివేమీ చేయలేదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ.. టీకాలు ఎప్పటికి సిద్ధం చేయగలరు? దేశానికి అవసరమైన టీకాలు ఎన్ని? ఎవరి దగ్గర తీసుకోవాలన్న దానిపై కేంద్రం తాజాగా ఆరా తీయటం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా.. టీకాల మీద పరిశోధనలు చేస్తున్న ఐదు సంస్థలతో సంప్రదింపులు స్టార్ట్ చేశారు. టీకాను ఎప్పటిలోపు ఉత్పత్తి చేయగలరు? ఒకవేళ దానికి వెంటనే ఆమోదం లభిస్తే.. టీకా ధర ఎంత ఉండాలని భావిస్తున్నారు? లాంటి అంశాలకు సంబంధించి మూడు రోజుల్లో తనకు నివేదికను ఇవ్వాలని కోరారు.

వ్యాక్సిన్ తయారీలో భాగంగా ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. భారత్ బయోటెక్.. జైడస్ క్యాడిలా.. బయోలాజికల్ - ఇ, జెన్నోవా కంపెనీల ప్రతినిధులతో కేంద్రమంత్రి హాజరయ్యారు. ఈ జాబితాలో ఉన్న వాటిలో రెండు కంపెనీలు హైదరాబాద్ కు చెందినవి కావటం గమనార్హం. ఇదిలా ఉండగా.. వ్యాక్సిన్ తయారైన పక్షంలో దేశానికి ఎన్ని వ్యాక్సిన్లుకావాలన్న దానిపై పెద్ద ఎత్తున సందేహాలు ఉన్నాయి.

తాజాగా కేంద్రమంత్రి ఆ డౌట్లను తీర్చేశారు.ప్రాథమిక.. బూస్టర్ టీకాలతో కలిపి దేశానికి 68 కోట్ల టీకాలు అవుసరమవుతాయని తేల్చారు. తమ ప్రాధాన్యత అంతా 18-65 ఏళ్ల లోపు వారేనని.. తుది సంఖ్యపై పక్కాగా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. తాము చెప్పినన్ని టీకాలు సరఫరా చేయటానికి వ్యాక్సిన్ మీద పని చేస్తున్న కంపెనీలు తమ సంసిద్ధతను ఇంకా తెలియజేయలేదన్న మాట వినిపిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాలు.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? దేశానికి ఎంత అవుసరమవుతాయి? దానికి అయ్యే బడ్జెట్ లెక్కలు వేసేసిన వేళ..భారత్ మాత్రం ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేయటం గమనార్హం.

Next Story