ఖాకీలనూ వదలని కరోనా.. నిపుణుల సంకేతాలే నిజమవుతాయా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Jun 2020 11:32 AM GMT
ఖాకీలనూ వదలని కరోనా.. నిపుణుల సంకేతాలే నిజమవుతాయా.?

గ్రేటర్ పరిధిలో 40 మంది పోలీసులకు కరోనా

కరోనా వైరస్..ఈ వైరస్ కు పేద, ధనిక తేడాలేమీ ఉండవని, ఆరోగ్యంగా ఉన్న మనిషే ఈ వైరస్ టార్గెట్ అని మొదటి నుంచి నిపుణులతో పాటు..మనం కూడా చెప్పుకుంటున్నాం. లాక్ డౌన్ 1 మొదలు ఇప్పటికీ కూడా పోలీసులు ఎక్కడిక్కడ చెకింగ్ లు చేస్తున్నారు. వైరస్ సోకకుండా ఉండేందుకు పాటించాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోని వారికి జరిమానాలు విధిస్తూ..సరైన కారణం లేకుండా బయటికి వచ్చినవారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రజలకు భయంకరమైన వైరస్ మహమ్మారి బారి నుంచి కాపాడేందుకు కృషి చేస్తున్న పోలీసులను సైతం కరోనా వదలడం లేదు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే..ఎక్కడి నుంచి వస్తుందో..ఎలా వస్తుందో అర్థం కావడం లేదు గానీ లాక్ డౌన్ నిబంధనలను ఒక్కొక్కటిగా సడలిస్తోన్న కొన్ని ప్రాంతాల్లో వైరస్ మరింత సామాజిక వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకూ దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 67, 500 కు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 2,300 మంది వరకూ మరణించారు. ఆ తర్వాత లిస్ట్ లో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న టాప్ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉండగా..టాప్ 15 రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రోజూ వందలకొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరికొంతకాలం పాటు లాక్ డౌన్ ను కొనసాగిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు అందకపోవడంతో..ప్రభుత్వ ఆదాయం కోసం మెల్ల మెల్లగా కేంద్రానికన్నా ముందే ఆంక్షలు సడలించడంతో కరోనా కూడా తన పని తాను చాలా నిజాయితీగా చేసేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే..మొదట ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించినట్లు భారత్ లో కరోనా మరణ మృదంగం తప్పదేమోనన్న భయాందోళనలో ఉన్నారు ప్రజలు.

లాక్ డౌన్ లో బయటకనిపిస్తే కేసులు పెట్టిన పోలీసులకు సైతం కరోనా ముప్పు తప్పలేదు. హైదరాబాద్ పరిధిలో ఒకే రోజులో 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకినట్లు నిర్థారణయింది. దీంతో ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 40కి చేరింది. అటు కరోనా పేషెంట్లకు చికిత్స అందజేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. మొదట ఇటలీని చూసి అయ్యోపాపం అనుకున్న మనకు.. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురుకాబోతుందన్న సంకేతాలొస్తున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో.. ప్ర‌పంచం ఈ మహమ్మారి బారినుంచి ఎప్పటికి కోలుకుంటుందో అర్థంకాని పరిస్థితి.

Next Story