ఏపీలో 23కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

By Newsmeter.Network  Published on  30 March 2020 12:15 PM IST
ఏపీలో 23కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే వెయ్యి పాజిటివ్‌ కేసుల నమోదు కాగా 27 మంది కరోనా మహమ్మారి వల్ల మృత్యువాత పడ్డారు. అటు ఏపీలో నూ కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. రోజుకు ఒకటి రెండు పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. పదుల సంఖ్యలో అనుమానితులు ఐసోలేషన్‌ కేంద్రాలకు చికిత్స నిమిత్తం తరలుతున్నారు. ఆదివారం వరకు ఏపీలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం ఉదయం ఏపీ ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. మొత్తం 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. వీటిలో అత్యధికంగా విశాఖ పట్టణంలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో నాలుగు చొప్పున, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మూడు చొప్పున, చిత్తూరు, కర్నూల్‌, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు.

Also Read :ఏప్రిల్‌ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?

ఇదిలా ఉంటే వీరిలో ఇద్దరికి రికవరీ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమహేంద్ర వరంలో 72ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, 495మందికి నెగిటివ్‌ అని తేలిందని, మరో 100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్ర క్వారంటైన్‌కు వెళ్లిన వారిలో 29,494 మంది ఉండగా.. వీరిలో 178 మంది చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో అడ్మిట్‌ అయ్యారని తెలిపారు.

Next Story