తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వైరస్‌ తీవ్రత కూడా జిల్లాలకు విస్తరిస్తోంది. శనివారం తెలంగాణలో మరో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 272కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 33 మంది డిశ్చార్జి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కమ్యూనిటీ స్ప్రెడ్‌ జరగలేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం పాజిటివ్‌గా నమోదు అవుతున్న కేసులన్నీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారు లేదా వారితో కలిసిన వారు మాత్రమే. షాద్‌నగర్‌లో, సికింద్రాబాద్‌లో చనిపోయిన వారు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారితో కలిసిన వారే. మర్కజ్‌ నుంచి 1090 మంది రాష్ట్రానికి వచ్చారు. వారందరినీ కూడా క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అన్ని క్వారంటైన్‌ సెంటర్లలో డాక్టర్లను కూడా నియమించామని, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారని తెలిపింది. అన్ని సెంటర్స్‌లో N-95మాస్క్‌లు, PPE కిట్స్‌ సరిపోయేన్ని అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వైద్యుల, వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కరోనా వైరస్‌ నిర్దారణ ఆరు ల్యాబ్‌లు 24 గంటలు పని చేస్తున్నాయి.

ఎంత మంఇ పాజిటివ్‌ కేసులు వచ్చినా చికిత్స అందించడానికి అన్నీ ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఐదు లక్షల N-95 మాస్కులు, ఐదు లక్షల పిపిఈ కిట్లు, ఐదు లక్షల వైరస్‌ ట్రాన్స్మిషన్‌ కిట్లు, 500 వెంటిలేటర్లు, నాలుగు లక్షల కరోనా టెస్టింగ్‌ కిట్లు, 20 లక్షల సర్జికల్‌ మాస్కులు, 25 లక్షల హ్యాండ్‌ గ్లౌసెస్‌ కొనుగోలు చేశామన్నారు. గచ్చిబౌలీలో 1500 పడకల ఆస్పత్రి మరో రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.