కోవిడ్-19 ప్రబలకుండా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇళ్లల్లో తలదాచుకోమని.. సోషల్ డిస్టెన్స్ అన్నది పాటించమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇల్లు లేని నిరుపేదల సంగతి ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా ఐసొలేషన్ కోసం వారు ఎక్కడికి వెళ్తారో అన్నది ఆ దేవుడికే తెలియాలి. ముఖ్యంగా వారందరూ అపరిశుభ్రత కలిగిన ప్రాంతాల్లో నివసిస్తూ ఉండడం వలన వైరస్ ఎక్కువగా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ కేర్ అన్నది ఎవరికీ దక్కడం లేదు.

ఇల్లు లేని చాలా మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఎక్కడో ఒక చోట తలదాచుకుంటూ ఉంటున్నారు. వీరందరికీ కనీసం అవగాహన అన్నది ఉన్నదో లేదో కూడా తెలియని పరిస్థితి. వీరిలో ఒకరికి వైరస్ వ్యాప్తి అన్నది జరిగినా మిగిలిన వారందరికీ ఆ ప్రభావం చూపనుంది. ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ సమయంలో వీరంతా చాలా ఇబ్బందులు పడ్డారు.

ఉండటానికి ఇళ్లంటూ లేని రాయదుర్గానికి శివ అనే వ్యక్తి తన సమస్యను చెప్పుకున్నాడు. తనకు ఉండడానికి ఇల్లు లేదని.. తన సొంత ఊరైనటువంటి చేవెళ్ల నుండి తాను గత ఏడాది వచ్చానని.. ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేసిందని.. ఇప్పటి వరకూ ఎటువంటి స్పందన లేదని తెలిపాడు శివ. ఎలాగోలా భోజనం దొరుకుతోంది.. జనతా కర్ఫ్యూ రోజున చాలా ఇబ్బందులే పడ్డానని అతడు చెప్పుకొచ్చాడు.

ఇలాంటి ఇల్లు లేని వారందరూ ఎక్కడో ఒక చోట పెద్ద ఎత్తున గ్రూపులుగా సంచరిస్తూ ఉండడం.. గుడారాలు వేసుకుని ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. నగరం లోని రైల్వే స్టేషన్స్ లాంటి చోట్ల వీరు నివసిస్తూ ఉంటారు. వీరందరి కోసం ప్రభుత్వం 20 షెల్టర్లను ఏర్పాటు చేయగా.. అందులో 14 షెల్టర్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఇల్లు లేని వారి వివరాలను గతంలో సేకరించినప్పటికీ.. ఇప్పుడు ఆ సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఉండే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేషన్ ఏప్రిల్ మొదటివారంలో ఇల్లు లేబి వారి గురించి కొత్తగా సర్వే చేయాలని అనుకుందని జిహెచ్ఎంసి అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికైతే తమ దగ్గర ఎటువంటి ప్లాన్ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఎమర్జెన్సీ ఫండ్స్ ను విడుదల చేయలేదని అంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.