కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

By సుభాష్  Published on  10 May 2020 2:17 AM GMT
కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో మే 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయగా, తాజాగా మరో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటి వరకూ కరోనా బాధితులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే సమయంలో వరుసగా రెండు సార్లు కరోనా పరీక్షలు చేసిన తర్వాత నెగిటివ్‌ వస్తేనే డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఇకపై ఇలాంటిదేమి ఉండదని కేంద్రం తెలిపారు.

డిశ్చార్జ్‌ చేయడానికి కరోనా పరీక్షలు అవసరం లేదని తెలిపింది. కరోనా కాకుండా ఇతర ప్రమాదకరమైన వ్యాధులున్నా, లేక కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నా.. అలాంటి వాళ్లను మాత్రమే డిశ్చార్జ్‌ చేసే సమయంలో పరీక్షలు చేయాలని తెలిపింది. కాగా, దీనికి సంబంధించి కరోనా బాధితులను మూడు రకాలుగా మార్చింది. స్వల్ప బాధితులు, సాధారణ బాధితులు, తీవ్ర బాధితులు.

ఇప్పటి వరకూ నాలుగైదు రోజులు, కరోనా లక్షణాలు కనిపించకపోతే వారికి ఆర్‌టీ, పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. అందులో నెగిటివ్‌ వస్తే 24 గంటల్లో మళ్లీ మరోసారి పరీక్షలు చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు సార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగిటివ్‌ వస్తేనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఇకపై ఇవన్నీ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

ఐసోలేషన్‌ కూడా ఇకపై 14 రోజులు ఉండదు

ఇకపై ఐసోలేషన్‌ కూడా 14 రోజులు ఉండదు. 10 రోజులు మాత్రమే. పది రోజుల్లో కోలుకుంటే వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేకపోతే పరీక్షలు చేయకుండా డిశ్చార్జ్‌ చేస్తారు. ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు ఇంట్లోనే ఓ ప్రత్యేక గదిలో ఉండమని సూచిస్తారు వైద్యులు. కరోనా మళ్లీ రాకపోతే సరి. ఒక వేళ మళ్లీ వస్తే దేశవ్యాప్తంగా 1075, 011-23978046, తెలంగాణలో 104, ఆంధ్రప్రదేశ్‌లో 0866-2410978 హెల్ప్‌ లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి... ఏం చేయాలో తెలుసుకోవాలి. దీనికి వాళ్లు సరైన సూచనలు, సలహాలు ఇస్తారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ ఏం చేయాలో చెబుతారు.

స్వల్ప బాధితులు:

ఈ బాధితులు ఐసోలేషన్‌లోకి వెళ్లిన మూడు రోజుల్లో జ్వరం తగ్గితే, ఇలాంటి వాళ్లను ఆస్పత్రిలో చేరిన పది రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తారు. ఇలాంటివారికి ఆక్సిజన్‌ అందించరు. డిశ్చార్జ్‌ సమయంలో కరోనా పరీక్షలేమి చేయరు. ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు ఒంటరిగా ఓ గదిలో ఉండాలి. ఎవరిని కూడా తాకకూడదు. అంతేకాదు నేరుగా ఎవరితోనూ మాట్లాడకూడదు.

సాధారణ బాధితులు:

ఇక సాధారణ బాధితులు మూడు రోజుల కంటే ఎక్కవ రోజులు జ్వరం ఉంటే మందుల ద్వారా అది తగ్గితే.. ఈ జాబితాలోకి వస్తారు. ఆక్సిజన్‌ అందించడం ద్వారా జ్వరం తగ్గిపోతే ఇలాంటి వాళ్లను 10వ రోజు డిశ్చార్జ్‌ చేస్తారు. పరీక్షలేవి చేయరు. ఆ సమయంలో జ్వరంగాని, ఇతర సమస్యలేవి ఉండకూడదు. ఇంటికి వెళ్లి మళ్లీ వారం రోజుల పాటు విడిగా ఉండాల్సి ఉంటుంది.

తీవ్ర బాధితులు:

కరోనాతో పాటు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారు. ఇలాంటి వారికి పది రోజుల కంటే ఎక్కువ రోజులే చికిత్స అవసరం ఉండవచ్చు. వీళ్లు కోలుకున్న తర్వాత ఓసారి కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్‌ వస్తే ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు ఇంట్లో ఒంటరిగా ఓ గదలో ఉండమని సూచిస్తారు వైద్యులు.

Next Story