అందరూ ఉన్నా ఎవరూ లేని ఏకాకి..ఇలాంటి మాటలు రోజు తెల్లారితే..సోషల్ మీడియాలో చాలానే చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు కళ్లముందే కదలాడుతున్నా ఎవరూ ఇల్లు కదలని పరిస్థితి. కరోనా తెచ్చిపెట్టిన కష్టం అలాంటిది. అయిన వారు కన్నుమూశారని తెలిసినా..కడసారి చూపుకు కూడా నోచుకోని కుటుంబాలెన్నో.. అంతెందుకు రోగం ముదిరి ముక్కుపచ్చలారని కూతురు చనిపోయిందని తెలిసినా విదేశాల్లో ఉన్న తండ్రి ఇంటికొచ్చి కూతురికి దహన సంస్కారాలు చేయలేక వీడియో కాల్ లోనే వీక్షించిన ఘటన మన తెలంగాణలోనే జరిగింది. ఇప్పుడు ఓ పండు ముసలి (85) అనారోగ్యంతో కన్నుమూస్తే..ఆమె పాడెత్తటానికి కావాల్సిన ఆ నలుగురి కోసం కన్న కొడుకు ఎదురుచూడాల్సిన పరిస్థితి. చివరికి ఏమీ చేయలేక తానే ఓ ట్రాక్టర్ మాట్లాడుకొని స్మశానానికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసి ఇంటికి చేరుకున్నాడు. ఇంతటి దయనీయమైన పరిస్థితి పగవాళ్లకి కూడా రాకూడదు. ఆమె జీవితకాలంలో తన చేతులమీదుగా పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసింది. అడిగినవారికల్లా లేదనకుండా దానం చేసింది. వచ్చేటపుడు ఒంటరిగా వచ్చినా..పోయేటపుడు మోయడానికి నలుగురు, కడసారి సాగనంపేందుకు వందమంది ఉండాలని పెద్దలు చెప్తుండేవారు. ఈమె జీవితంలో అలాంటివారందరినీ సంపాదించుకున్నప్పటికీ..కరోనా రాకాసి వారిని రాకుండా ఆపేసింది. వచ్చారో..చచ్చారే అని బెదిరించింది.

Also Read : ప్రజల కోసం కలను పక్కన పెట్టిన బాషా ముఖర్జీ..

ఒక్కడై రావడం..ఒక్కడై పోవడం..నడుమ ఈ నాటకం విధి లీల అన్న పాటను ఎవరు రాశారో గానీ..సరిగ్గా ఇప్పుడు చనిపోతున్నవారందరి పరిస్థితీ ఇదే. విధి లీల కాకపోతే మరేంటి ? సాధారణ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఓదార్చేందుకు, పరామర్శించేందుకు బంధువులతో పాటు, ఇరుగుపొరుగువారంతా ఆ ఇంటికి చేరుకునేవారు. ఇప్పుడు అలా కాదు..చనిపోయినవారిని చూసేందుకు వెళ్తే ఆ కరోనా ఎక్కడ తమకు కూడా అంటుకుందోనన్న భయం. ఒకవేళ వెళ్లాలనుకున్నా లాక్ డౌన్ కారణంగా నిబంధనలు ఉల్లంఘించి వెళ్లలేరు. ఇందులో పేద, గొప్ప తేడా లేదు. ఎంత గొప్పవారైనా ఇదే పరిస్థితి. ఇక చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించడం గగనమైపోతోంది. పాడె మోసేందుకు నలుగురు రారు. ఉన్నవారైతే ఏదోరకంగా వాహనాల్లో తీసుకెళ్తారు కానీ..పేద వాళ్ల పరిస్థితి ఏంటి ? నానా కష్టంగా నలుగురినీ పిలుచుకోవాల్సి వస్తోంది. ఇలా నానా తంటాలు పడి చితి పేర్చి కొరివి పెట్టడమే మహాగొప్ప అన్నట్లుంది. ఇక కర్మకాండలు, కాకి ముట్టడాలంటే..అవన్నీ కరోనాను కాటికి పంపాకేనంటున్నారు. కర్మకాండలు చేసేందుకు కనీసం అయ్యగార్లైనా దొరకని దీనస్థితి.

ఎంత ప్రముఖులైనా ఫోన్ లోనే పరామర్శలు

ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ తల్లి మరణిస్తే..ఆ విషయాన్ని ఫేస్ బుక్ లోనే తెలిపారు. పైగా ఎవరూ రావొద్దని కూడా కోరారు. ఇదంతా కరోనా మహిమే. లాక్ నిబంధనలతో దగ్గరి బంధువులు కూడా రావడం లేదు. ఫోన్ లోనే పరామర్శలు జరుగుతున్నాయి. పెద్ద కర్మలు చేసినా ఎక్కువమంది రారు కాబట్టి చాలా వరకూ అలాంటి కార్యక్రమాలను తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు.

స్మశానవాటికల్లో సైతం కరోనా కట్టడి చర్యలు కనిపిస్తున్నాయి. అంబర్ పేట స్మశానవాటికలో రోజుకు సగటున 10 మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నప్పటికీ..బంధువులు, మిత్రులు కానరావడంలేదు. పాడె మోసేందుకు నలుగురు, కొరివి పెట్టేందుకు ఒకరు..వెరసి ఐదారుగురు మినహా ఎక్కువ కనిపించట్లేదు. వారు కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించే రావాలని నిబంధనలు పెట్టారు.

Also Read : ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

నల్లగొండ జిల్లా తిప్పర్తికి సోమ వెంకటాచారి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. ఆయన అంత్యక్రియలకు బంధువులే కాకుండా ఇరుగుపొరుగువారు కూడా రాలేదు. కరోనా కారణంగా పాడె పట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో చివరకు సర్పంచ్‌ రమేశ్‌ గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. పాడెను కూడా ఇంటివాళ్లే సిద్ధం చేసుకున్నారు.

Corona Lockdown Effect On Funerals

ఇదిలా ఉంటే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరులో తండ్రికి కూతురే దహన సంస్కారాలు నిర్వహించింది. నల్లనాగుల సోమనాధం(60) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందగా..దహన క్రియలు చేసేందుకు కుమారులు లేరు. అయినవారెవరూ కడసారి చూపుకు రాలేదు. దీంతో కూతురు వసుధే అంతిమ సంస్కారాలు నిర్వహించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో బంధువులు రాకపోవడంతో గ్రామపంచాయతీ సహకారంతో ట్రాక్టర్‌ సమకూర్చగా, నలుగురే దహనసంస్కారాలు నిర్వహించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.