ఒక వ్యక్తితో 104 మందికి కరోనా
By సుభాష్ Published on 7 July 2020 4:05 PM ISTదేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని ఓ జ్యూవెలరీ స్టోర్ కరోనా హాట్ స్పాట్ కేంద్రంగా మారిపోయింది. ఆ స్టోర్‌లో పని చేసే ఓ వ్యక్తికి జూన్ 22న కరోనా వైరస్ సోకింది. దీంతో స్టోర్‌లో మొత్తం 303 మంది పని చేస్తుంటారు.
ఇక స్టోర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా, మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా, 104 మందికి పాజిటివ్ అని తేలింది. ఒక్క వ్యక్తి వల్ల 104 మందికి కరోనా సోకినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అతనికి కరోనా సోకిన వెంటనే ఐసోలేషన్‌లో ఉంచామని, అంతమందికి సోకుతుందని ముందుగా భావించలేదని జిల్లా అధికారి తెలిపారు. అయితే వారం రోజుల వ్యవధిలో ఆ జ్యువెలరీ స్టోర్‌లో అతనితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో 104 మందికి కరోనా వ్యాపించిందన్నారు. దీంతో ఆ జ్యువెలరీ స్టోర్‌ను రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.