ఆ టెకీ ఎక్కడెక్కడకు వెళ్ళొచ్చాడు..!  

By అంజి  Published on  4 March 2020 10:24 AM GMT
ఆ టెకీ ఎక్కడెక్కడకు వెళ్ళొచ్చాడు..!  

సికింద్రాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇటీవలే దుబాయ్ కు వెళ్లి వచ్చాడు. అతడికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలియడంతో వెంటనే అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. 24 సంవత్సరాల ఈ టెకీ కలిసిన 88 మందిలో 36 మందిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ అధికారులు మంగళవారం నాడు స్పష్టం చేశారు. అతడు కలిసిన వారిలో 45 మందిని ముందు జాగ్రత్తగా సోమవారం నాడు గాంధీ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. బుధవారం నాడు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు రానున్నాయి. ముఖ్యంగా ఇతడితో కలిసి బెంగళూరు నుండి హైదరాబాద్ కు బస్సులో ప్రయాణించిన వారు.. కుటుంబ సభ్యులకు వైరస్ సోకిందేమోనన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

వైరస్ సోకిన వ్యక్తి బెంగళూరు నగర శివారు ప్రాంతాల్లోని పీజీలో ఉన్నాడు. అతడి వృత్తిలో భాగంగా ఫిబ్రవరి 15 న దుబాయ్ కి వెళ్లగా.. ఫిబ్రవరి 20న తిరిగి చేరుకున్నాడు. ఫిబ్రవరి 20, 21న ఆఫీసులో తన విధులు నిర్వహించాక.. హైదరాబాద్ కు చేరుకున్నాడు. సోమవారం నాడు అతడి శాంపుల్స్ ను పరిశీలించగా కరోనా వైరస్ పాజిటివ్ గా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఐటీ హబ్‌ లోని టెకీలలో సరికొత్త టెన్షన్ మొదలైంది. మైండ్‌ స్పేస్‌ బిల్డింగ్‌లో పని చేస్తున్న ఓ మహిళకు కరోనా వైరస్‌ సోకిందన్న వార్త బయటకు పొక్కడంతో ఉద్యోగస్తులను ఇంటికి పంపిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటూ సూచనలు వస్తున్నాయి. డీఎస్‌ఎమ్‌ కంపెనీలో పని చేస్తున్న ఆ మహిళ ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చింది. ఆమెకు ఫ్లూ లక్షణాలు ఉండగా.. కరోనా పాజిటివ్‌ అని తెలిసింది. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందన్న భయంతో మైండ్‌స్పేస్‌ పూర్తిగా ఖాళీ అయ్యింది.

కరోనాపై అలర్ట్‌ అయిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ ను అడ్డుకోవాలని అధికారులకు సూచించింది. వెంటనే 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. వైరస్ ఛాయలు ఉన్న ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తే వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా చేర్చుకోవాలని తెలంగాణ అధికారులు సూచించారు. వెంటనే ప్రభుత్వానికి సూచించాలంటూ ఆజ్ఞలు జారీ చేశారు. రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ 50,000 మాస్కులు పంపాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని.. కరోనా వచ్చిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి ట్రీట్‌మెంట్ లేకుండా తగ్గిపోతుందన్నారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశముందన్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్‌ను అరికట్టవచ్చని ఈటల చెప్పారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్‌లు పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌లో మూడు ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

హైదరాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ఓ టెకీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చేశారు. పిల్లలకు ఎక్కడ ఈ వైరస్ సోకుతుందోనని భయపడుతున్నారు తల్లిదండ్రులు. టెక్కీ ఇంటి పరిసరాల్లో 'స్ప్రే' జల్లడం మొదలు పెట్టింది. కరోనా భయం ప్రజలను వెంటాడుతోంది. జీహెచ్ఎంసీ వైరస్ నివారణ కోసం బ్లీచింగ్ పౌడర్ ను చెల్లించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తను కూడా తీసివేయించారు. ఓపెన్ ప్లాట్స్ లో ఉన్నటువంటి చెత్తను కూడా ఏరివేయించారు.

Next Story