విశాఖ ఐటీ కంపెనీలపై వైరస్ ఎఫెక్ట్.. అలా చేస్తున్నారట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2020 8:23 AM GMT
విశాఖ ఐటీ కంపెనీలపై వైరస్ ఎఫెక్ట్.. అలా చేస్తున్నారట

ఐటీ అన్నంతనే తెలుగువారికి గుర్తుకొచ్చేది రెండే రెండు నగరాలు. ఒకటి హైదరాబాద్ మరొకటి బెంగళూరు. తప్పదనుకుంటే చెన్నై. ఇంకా కాదనుకుంటే విశాఖపట్నం. ఏమైనా.. సరైన అవకాశాలు రాక.. వ్యక్తిగత ఇబ్బందులు.. ఇంకేదైనా కారణాలతో ఉన్న వారు మాత్రమే విశాఖలో ఐటీ ఉద్యోగానికి ఓకే అనే పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఐటీలో అడుగులు వేస్తున్న విశాఖపట్నానికి కరోనా కారణంగా పడిన దెబ్బ అంతా ఇంతా కాదు. కొత్త ప్రాజెక్టులు రాని పరిస్థితి ఒకటైతే.. విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున ఆఫీసుల్ని ఏర్పాటు చేసిన వారంతా ఇప్పుడు కిందామీదా పడిపోతున్నారు.

కరోనా పుణ్యమా అని.. ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గిపోయాయి. నిర్వహణ ఖర్చులు ఎక్కువయ్యాయి. అప్పటికి కొంతమంది ఉద్యోగుల్ని తీసేయటం.. మరికొంతమంది ఉద్యోగుల జీతాల్లో కోత విధించటం ద్వారా నెట్టుకొస్తున్నాయి. తాము వేసుకున్న అంచనాలకు భిన్నంగా కరోనా మరికొంతకాలం కొనసాగటం ఖాయమని తేలిపోవటంతో ఇప్పుడు సరికొత్త నిర్ణయాల్ని తీసుకుంటున్నాయి విశాఖలోని పలు ఐటీ సంస్థలు.

ఉద్యోగులకు అనువుగా ఉండేలా.. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆఫీసుల్ని ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవటం.. వర్క్ ఫ్రం హోం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్నారు. దీంతో.. పెద్ద ఎత్తున టూలెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. వర్క్ ఫ్రం హోం కారణంగా అద్దెలకు ఉండే అవివాహితులు తమ ఊళ్లకువెళ్లిపోతున్నారు. దీంతో.. ఇళ్లు.. హాస్టల్స్ ఖాళీ అవుతున్నాయి. దీంతో.. ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు దర్శనమిచ్చే పరిస్థితి.

విశాఖకు చెందిన పలు ఐటీ కంపెనీలు తమ ఆఫీసుల్ని ఖాళీ చేస్తుండటంతో వీటి యజమానులకు దిక్కుతోచటం లేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని కమర్షియల్ స్పెస్ ను క్రియేట్ చేస్తే.. కరోనా ఊహించని దెబ్బ కొట్టిందని వాపోతున్నారు. మరో ఆరేడు నెలల పాటు ఇలాంటి పరిస్థితే కొనసాగేలా ఉండటం.. కరోనా తర్వాత కూడా మునుపటి పరిస్థితి వెంటనే వచ్చే అవకాశం లేకపోవటంతో.. భవిష్యత్తు నిరాశాజనకంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో విశాఖలో ఐటీ రంగంలో పెను మార్పులు వస్తాయని.. పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పట్లో వాస్తవమయ్యే పరిస్థితి లేదంటున్నారు.

Next Story