కరోనా ఎఫెక్ట్‌: దర్శనాలు నిలిపివేసే దిశగా టీటీడీ..?

By సుభాష్  Published on  18 July 2020 10:21 AM IST
కరోనా ఎఫెక్ట్‌: దర్శనాలు నిలిపివేసే దిశగా టీటీడీ..?

ఏపీలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. ఇక తిరుమలలో కూడా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో తిరుమల శ్రీవారి దర్శనాలు నిలిచిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో 20 రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి టీటీడీ నివేదిక సమర్పించింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతండటంతో శ్రీవారి దర్శనాలు నిలిపివేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జీయంగార్లు సహా 15 మంది అర్చకులకు కరోనా సోకిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తం అవుతోంది. దర్శనాలు నిలిపివేయకుంటే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని టీటీడీ ప్రభుత్వానికి తెలిపినట్లు తెలుస్తోంది. తిరుమలలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ కావడంతో అర్చకులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

మరో వైపు శ్రీవారిదర్శనాలు నిలిపివేయాలంటూ తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షుతుల మరో సంచలన ట్వీట్‌ చేశారు. అర్చకుల స్థానం భర్తీ చేయలేదని, వారిని కాపాడుకోవాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే శ్రీవారి ఆరాధనను ఒక్క రోజు కూడా ఆపకుండా, దర్శనాలు నిలిపివేసి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ ట్వీట్‌ను ఆయన ముఖ్యమంత్రి జగన్‌, టీటీడీ చైర్మన్‌లకు ట్యాగ్‌ చేశారు. కాగా, తిరుమలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. పాజిటివ్‌ కేసులే కాకుండా మరణాలు కూడా అధికంగా ఉంటున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు.



Next Story