అగమ్యగోచరంగా మారిన ప్రైవేట్ టీచర్ల పరిస్థితి..
By రాణి Published on 6 July 2020 10:08 AM GMTకరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారిలో అధిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులందరినీ ఆయా యాజమాన్యాలు జీతాలివ్వలేక తొలగించాయి. దీంతో దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసిన వారంతా ఇప్పుడు కుటుంబాలను పోషించుకునేందుకు ఏ పనైనా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న కొంతమంది సొంతంగా వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. మరికొందరు సొంత ఊళ్లకు చేరుకుని పొలం పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఏ అవకాశం లేనివాళ్లు కొత్త ఉద్యోగాల కోసం వేట మొదలు పెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగులకైతే ఉద్యోగం పోదన్న భరోసా ఉంటుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి అలాంటి భరోసా ఏమీ ఉండదు. సంబంధిత యాజమాన్యం జీతమిచ్చినప్పుడే తీసుకోవాలి గానీ.. జీతాలివ్వమని అడిగే ధైర్యం చేయడం లేదు. అలా అడిగితే ఉన్న ఉద్యోగం కూడా ఎక్కడ ఊడిపోతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఏటా జూన్ నాటికి తెరచుకునే స్కూళ్లు..ఇప్పుడు ఆగస్టు వరకూ తెరిచేందుకు వీలులేదు. ఆ తర్వాతైనా స్కూళ్లు తెరుచుకుంటాయో లేదో డౌటే. ఆన్ లైన్ లో విద్యార్థులకు క్లాసులు చెప్తున్న కొన్నికార్పొరేట్ విద్యాసంస్థలు ముక్కుపిండి ఫీజులనైతే వసూలు చేస్తున్నాయి కానీ..పాఠాలు చెప్పే టీచర్లకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు.
నెలకు రూ.15 వేల జీతానికి పనిచేసే టీచర్లకు ఇప్పుడు నెలకు కనీసం రూ.10 వేల జీతమైనా రాకపోవడంతో కుటుంబ పోషణ కనాకష్టంగా మారిందని వాపోతున్నారు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, పై ఖర్చులకు కూడా యాజమాన్యం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. అలా జీతాలు సరిపోని చాలా మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు కూలి పనులకు కూడా వెళ్తున్నారు. కనీసం ప్రభుత్వమైనా తమకు ఆర్థిక సహాయాన్నందించి ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్లు వేడుకుంటున్నారు.